మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 19, 2020 , 14:31:03

ఇండియాకు చెక్‌.. ‌చైనా కొత్త ఎత్తుగ‌డ‌

ఇండియాకు చెక్‌.. ‌చైనా కొత్త ఎత్తుగ‌డ‌

వాషింగ్ట‌న్‌: అమెరికాను వెన‌క్కి నెట్టి తాను అగ్ర‌రాజ్యంగా మార‌డానికి చైనా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ని అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదిక‌లో వెల్ల‌డించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాను చైనా ప్ర‌త్య‌ర్థిగా భావిస్తోంద‌ని తెలిపింది. అమెరికాతోపాటు దాని మిత్ర‌దేశాలు, ఇత‌ర ప్ర‌జాస్వామ్య దేశాల‌తో ఇండియాకు ఉన్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి ఇక తెర‌దించాల‌ని కూడా చైనా భావిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. అమెరికా కొత్త అధ్య‌క్షుడిగా జో బైడెన్ బాధ్య‌త‌లు స్వీక‌రించే ముందు స‌వివ‌ర‌మైన పాల‌సీ డాక్యుమెంట్‌ను విదేశాంగ శాఖ‌ విడుద‌ల చేసింది. ద‌క్షిణాసియా ప్రాంతంలోని చాలా దేశాల భ‌ద్ర‌త‌, స్వతంత్ర‌త‌, ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ తీసేందుకు చైనా ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించింది. 


అమెరికా, జ‌పాన్, ఆస్ట్రేలియా, ఇత‌ర ప్ర‌జాస్వామ్య దేశాల‌తో భార‌త్‌కు ఉన్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని క‌ట్ చేయాల‌ని చైనా భావిస్తోంద‌ని అని 70 పేజీల‌ ఆ నివేదిక తెలిపింది. ఆధిప‌త్య పోరులో చైనీస్ క‌మ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) కొత్త శ‌కానికి నాంది ప‌లికింద‌ని, ఈ విష‌యాన్ని అమెరికాతోపాటు ఇత‌ర ప్ర‌పంచ దేశాలు కూడా గ‌మ‌నిస్తున్నాయ‌ని వెల్ల‌డించింది. చైనా విసురుతున్న ఈ సవాలును గ‌మ‌నించి, అమెరికా త‌న ఆధిప‌త్యాన్ని కాపాడుకోవాల‌ని ఆ నివేదిక సూచించింది. త‌మ‌ ఆధిప‌త్యం త‌ప్ప‌ద‌న్న భావ‌న‌ను ఆ ప్రాంత దేశాల్లో క‌ల్పించ‌డానికి చైనా ప్ర‌య‌త్నిస్తోంద‌ని స్ప‌ష్టం చేసింది. చైనా ప్ర‌ధాన టార్గెట్లు అమెరికా మిత్ర దేశాలైన జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్‌తోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఇండియా, వియ‌త్నాం, ఇండోనేషియా, తైవాన్ అని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక తెలిపింది.