సోమవారం 30 మార్చి 2020
International - Jan 23, 2020 , 02:06:47

వణికిస్తున్న ‘కరోనా’

వణికిస్తున్న ‘కరోనా’
  • చైనాలో 17కు చేరిన మృతులు
  • 440 మందికిపైగా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ
  • ఇతర దేశాల్లోనూ కేసులు నమోదు

బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. చైనాలో ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నది.  ఈ వైరస్‌ కారణంగా చైనాలో మృతిచెందిన వారి సంఖ్య బుధవారం నాటికి 17కు చేరుకున్నది. మరోవైపు వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 444కి పెరిగింది. అమెరికా, హాంకాంగ్‌, మకావ్‌, మెక్సికో దేశాల్లోనూ వైరస్‌ తాలూకు కేసులు నమోదయ్యాయి. చైనాలో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగించనున్న నేపథ్యంలో వైరస్‌ మరింత ప్రబలే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. వైరస్‌కు కేంద్రస్థానమైన వుహాన్‌లో ప్రజలు నగరాన్ని దాటి వెళ్లొద్దని అధికారులు అడ్వైజరీ జారీచేశారు. సాధారణ జలుబు నుంచి తీవ్రస్థాయి శ్వాసకోశ వ్యాధుల వరకు వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వైరస్‌ కుటుంబానికి చెందిన ఈ కరోనా వైరస్‌ను చైనాలోని వుహాన్‌ నగరంలో ఇటీవల గుర్తించారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, న్యుమోనియా.. ఈ వైరస్‌ లక్షణాలు. కరోనా వైరస్‌ కారణంగా 444 మందికి న్యుమోనియా సోకినట్లు చైనా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం కొత్తగా 149 కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ వైద్య కమిషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లీ బిన్‌ బుధవారం మీడియాకు తెలిపారు. 

ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిర్ధారణ అయిన నేపథ్యంలో వైరస్‌ నిర్మూలన, కట్టడికి సంబంధించి ప్రస్తుతం చైనా అత్యంత క్లిష్టదశలో ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రజలు వుహాన్‌కు వెళ్లొద్దని, అలాగే వుహాన్‌ ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆయన సూచించారు. విదేశాల్లో.. జపాన్‌లో ఒకరికి, థాయ్‌లాండ్‌లో ముగ్గురికి, దక్షిణకొరియాలో ఒకరికి ఈ వైరస్‌ సోకింది. అమెరికాలోనూ ఈ వైరస్‌ తాలూకు తొలి కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు, మకావ్‌, మెక్సికో, హాంకాంగ్‌లోనూ తాజాగా కేసులు నమోదయ్యాయి. కాగా, వుహాన్‌లో వైరస్‌ విజృంభిస్తుండడంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రజలు నగరాన్ని దాటి వెళ్లొద్దని అధికారులు అడ్వైజరీ జారీ చేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వుహాన్‌లో సుమారు 700 మంది వరకు భారతీయ విద్యార్థులు ఉన్నారు.  వైరస్‌ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. అంతర్జాతీయ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నది. 


భారత్‌లో కరోనా కేసులు లేవు: కేంద్రం

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి ప్రీతీ సూడాన్‌ బుధవారం వెల్లడించారు.  ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో మంగళవారం వరకు మొత్తం 43 విమానాలు, 9,156 మంది ప్రయాణికులను పరిశీలించామని చెప్పారు. చైనాలో వైరస్‌ వ్యాప్తిపై అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. 


logo