శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 13:39:27

నింగికెగిరిన లాంగ్‌మార్చ్‌-5.. మార్స్ దిశ‌గా చైనా రోవ‌ర్‌

నింగికెగిరిన లాంగ్‌మార్చ్‌-5.. మార్స్ దిశ‌గా చైనా రోవ‌ర్‌

హైద‌రాబాద్‌: అంగార‌క గ్ర‌హ అధ్య‌య‌నం కోసం చైనా ఇవాళ మార్స్ మిష‌న్‌ను చేప‌ట్టింది.  లాంగ్‌మార్చ్‌-5 రాకెట్ ద్వారా మార్స్ రోవ‌ర్‌ను నింగిలోకి పంపింది.  మార్స్ గ్ర‌హ కక్ష్యలోకి చేర‌డ‌మే కాకుండా, ఆ గ్ర‌హంపై ల్యాండై రోవ‌ర్‌ను దించ‌నున్న‌ది.  అయిదు ట‌న్నుల బ‌రువున్న లాంగ్ మార్చ్‌-5  ఇవాళ విజ‌య‌వంతంగా రోద‌సిలోకి వెళ్లింది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం 12.41 నిమిషాల‌కు ఈ ప్ర‌యోగం జ‌రిగింది. హైన‌న్ ప్రావిన్సులో ఉన్న వెన్‌చాంగ్ స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి ఈ ప్ర‌యోగం సాగింది. 

రాకెట్ నింగికి ఎగిరిన 36 నిమిషాల త‌ర్వాత‌.. ఆర్బిటార్‌, రోవ‌ర్ ఉన్న స్పేస్‌క్రాఫ్ట్.. భూ క‌క్ష్య‌ను వీడింది. మంగ‌ళ గ్ర‌హాన్ని చేరేందుకు ఏడు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు చైనా నేష‌న‌ల్ స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్ వెల్ల‌డించింది. చైనా త‌న మార్స్ మిష‌న్‌కు తియ‌న్‌వెన్‌-1 అని నామ‌క‌ర‌ణం చేసింది. తియ‌న్‌వెన్ అంటే స్వ‌ర్గాన్ని ప్ర‌శ్నించ‌డం. క్రీస్తు పూర్వం 340 సంవ‌త్సరంలో క్యూ యువాన్ క‌వి రాసిన ప‌ద్యాల నుంచి ఈ పేరును సెలెక్ట్ చేశారు.  వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్స్ ఆర్బిటార్‌.. గ్ర‌హానికి చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి. 

మార్స్ క‌క్ష్య‌లోకి వెళ్లిన త‌ర్వాత‌.. చైనా వ్యోమ‌నౌక సుమారు మూడు నెల‌ల పాటు ఆ క‌క్ష్య‌లోనే తిర‌గ‌నున్న‌ది. అనువైన ల్యాండింగ్ ప్ర‌దేశం దొరికిన త‌ర్వాత రోవ‌ర్ ఆ గ్రహంపై దిగుతుంది. హై రెజ‌ల్యూష‌న్ కెమ‌రాల‌తో ఈ మిష‌న్ ఆప‌రేట్ చేయ‌నున్నారు. రోవ‌ర్ మార్స్‌పై దిగిన త‌ర్వాత ఆ గ్ర‌హంపై శాస్త్రీయ అన్వేష‌ణ కొన‌సాగించ‌నున్నారు.  రోవ‌ర్ జీవిత‌కాలం 90 మార్షియ‌న్ డేస్ అని తెలిపారు. అంటే భూమిపై దాని జీవిత‌కాలం మూడు నెల‌లు అన్న‌మాట‌. ఆర్బిటార్ జీవిత‌కాలం ఒక మార్షియ‌న్ ఇయ‌ర్‌గా లెక్కించారు. అంటే భూమిపై దాని వ‌య‌సు 687 రోజులు అని అర్థం. అంగార‌కుడి ఆకృతితో పాటు భౌగోళిక అధ్య‌య‌నం చేయ‌నున్నారు. ఆ గ్ర‌హంపై ఉన్న నేల స్వ‌భావాన్ని కూడా స్ట‌డీ చేస్తారు. logo