ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 16:05:57

118 యాప్‌లపై నిషేధం.. చైనా ఆందోళన

118 యాప్‌లపై నిషేధం.. చైనా ఆందోళన

బీజింగ్‌ : పబ్‌జీ సహా 118 యాప్‌లను నిషేధిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా గురువారం స్పందించింది. చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి గో ఫెంగ్‌ మాట్లాడుతూ దేశం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్‌ ఉల్లంగించిందని ఆరోపించారు. చైనా యాప్‌లపై బ్యాన్‌ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌ నిర్ణయం విచారకమని, మరోసారి నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరారు.

కాగా, భారత సైబర్‌ స్పేస్‌ భద్రతే లక్ష్యంగా పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం విషయం తెలిసిందే. పలు యాప్‌లు యూజర్ల డేటాను చట్టవిరుద్ధంగా భారత్‌కు వెలుపల ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు తమకు వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, రక్షణ, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ‘హానికర యాప్‌’లపై నిషేధం విధించాలని హోంశాఖకు చెందిన సైబర్‌ క్రైమ్‌ సెంటర్‌ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. 

భారత్‌లో దాదాపు 3.3 కోట్ల మంది క్రియాశీలక పబ్‌జీ యూజర్లు ఉన్నట్లు అంచనా.  నిషేధానికి గురైన వాటిలో పబ్‌జీతోపాటు పబ్‌జీలైట్‌, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, వియ్‌చాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీయూన్‌ వంటి యాప్‌లు ఉన్నాయి. అలాగే జూన్‌లో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై బ్యాన్‌ విధించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo