మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 08, 2020 , 18:41:06

అమెరికాపై చైనా ప్రతీకార చర్య..

అమెరికాపై చైనా ప్రతీకార చర్య..

బీజింగ్: టిబెట్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా సూచించింది. తీరు మార్చుకోకపోతే ఆ దేశ దౌత్యాధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికా దౌత్యాధికారులు, జర్నలిస్టులు, పర్యాటకులను టిబెట్‌లోకి చైనా అనుమతించకపోవడంపై అమెరికా మండిపడుతున్నది. టిబెట్ చట్టం పేరుతో చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం ఆరోపించారు. ఈ నేపథ్యంలో చైనా అధికారుల వీసాలను పరిమితం చేస్తామని ఆయన చెప్పారు.

కాగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ బుధవారం దీనిపై స్పందించారు. టిబెట్ అంశంలో అతిగా ప్రవర్తించే అమెరికా దౌత్యాధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. టిబెట్ అటానమస్ రీజియన్ విషయంలో విదేశీయుల జోక్యాన్ని తాము సహించబోమన్నారు. చైనా అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవడాన్ని అమెరికా మానుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో మరింతగా వ్యవహరిస్తే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతినే అవకాశమున్నదని జావో లిజియన్ హెచ్చరించారు.logo