గురువారం 28 మే 2020
International - Apr 06, 2020 , 16:59:48

చైనా పచ్చి నిజాలు బైటపెట్టాలి.. ఎన్నారై లాయర్ డిమాండ్

చైనా పచ్చి నిజాలు బైటపెట్టాలి.. ఎన్నారై లాయర్ డిమాండ్

హైదరాబాద్: కరోనాకు సంబంధించిన పచ్చినిజాలు చైనా బయటపెట్టాలని కరోనా కోరల నుంచి బయటపడ్డ అమెరికాలోని భారత సంసతి న్యాయవాది రవి బాత్రా డిమాండ్ చేశారు. అలాగైతేనే శాస్త్రవేత్తలు, వైద్యులు ఏదైనా పరిష్కారం కనిపెట్టగలరని ఆయన అన్నారు. టీకా కనిపెట్టేంత వరకు ఎవరూ బయటకు వెళ్లలేరని చెప్పారు. న్యూయార్క్ లో నివసించే బాత్రా, ఆయన కుటుంబ సభ్యులు ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నారు. చైనా గుట్టు విప్పితే అప్పుడే మన హీరో ఆంథోనీ ఫాసీ (అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య సలహాదారు) వీలైనంత త్వరలో టీకాను కనుగొంటారని పేర్కొన్నారు. మృత్యువుతో కరచాలనం చేసి వచ్చాను కదా.. ఏదైనా మంచిపని చేయాలని అనుకుంటున్నాను - అని బాత్రా అన్నారు. టీకా కనిపెట్టేంత వరకు ఎవరూ పనికి వెళ్లలేరు.. ఆటలాడలేరు.. బడికి కూడా పోలేరు.. మనకు తెలిసిన జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు చచ్చిపోయాయి. కోలుకునే సూచనలు కూడా లేవు - అని ఆయన పీటీఐ వార్తాసంస్థకు చెప్పారు. ప్రస్తుత రూపంలో ప్రపంచీకరణ కూడా కొనసాగలేదని అన్నారు.  విశ్వమహమ్మారి ముందు సాపేక్ష ఆధిక్యతా సూత్రం కూడా చచ్చిపోతుందని చెప్పారు. ప్రస్తుత వెంటిలేటర్లలోని విడిభాగాలు ప్రపంచమంతటా తయారయ్యాయని, ఇకముందు ఇది ఆగిపోతుందని బాత్రా జోస్యం చెప్పారు. అమెరికా తన సొంత వెంటిలేటర్లను, ఎన్-95 మాస్కులను తయారు చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని అన్నారు.


logo