శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 21:54:47

చైనాలో వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో మద్దతు!

చైనాలో వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో మద్దతు!

బీజింగ్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా జరుగుతున్నా.. దేశంలో టీకా అత్యవసర వినియోగానికి తమకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మద్దతు తెలిపిందని చైనా వెల్లడించింది. జూన్ చివరలో డబ్ల్యూహెచ్‌ఓతో కమ్యూనికేట్ చేసిన చైనా జూలైలో తన అత్యవసర కార్యక్రమాన్ని ప్రారంభించిందని జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారి జెంగ్ జాంగ్వీ తెలిపారు. వ్యాక్సిన్ల మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నడుస్తున్నాయని, వాటి సామర్థ్యం, భద్రతపై పూర్తి అవగాహన రాలేదన్నారు. అయినా, దేశంలో లక్షలాది మంది కొవిడ్‌ వారియర్స్‌తోపాటు ఇతర పరిమిత సమూహాలకు టీకా ఇచ్చినట్లు వెల్లడించారు. 

‘జూన్ చివరిలో చైనా స్టేట్ కౌన్సిల్ కొవిడ్‌- 19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగ కార్యక్రమం ప్రణాళికను ఆమోదించింది.’ అని జెంగ్‌ తెలిపారు. దాని ఆమోదం తర్వాత జూన్ 29 న చైనాలోని డబ్ల్యూహెచ్‌వో కార్యాలయ  సంబంధిత ప్రతినిధులతో మాట్లాడామని, వారు అనుమతి ఇచ్చారని వెల్లడించారు. అయితే, ఈ విషయమై చైనాలోని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధిని వివరణ కోరగా, స్పందించకపోవడం గమనార్హం.

ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో జాతీయ నియంత్రణ అధికారులు తమ సొంత పరిధిలో వైద్య ఉత్పత్తుల వాడకాన్ని ఆమోదించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఈ నెలలో జెనీవాలో చెప్పారు. ఇదిలా ఉండగా, చైనా సర్కారు తన అత్యవసర వినియోగ కార్యక్రమం పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించలేదు. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ అభివృద్ధి చేసిన రెండు టీకాలతోపాటు, సినోవాక్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగ కార్యక్రమంలో చేర్చినట్లు తెలుస్తోంది. అలాగే, కాన్సినో బయోలాక్స్‌ అభివృద్ధి చేసిన నాలుగో ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను మిలటరీలో పనిచేసేవారికి ఇచ్చేందుకు జూన్‌లో ఆమోదించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.