మంగళవారం 02 మార్చి 2021
International - Jan 27, 2021 , 16:12:53

యాప్‌లపై నిషేధం తొలిసారి స్పందించిన చైనా

యాప్‌లపై నిషేధం తొలిసారి స్పందించిన చైనా

న్యూఢిల్లీ: చైనా దేశానికి చెందిన యాప్‌లపై నిషేధం విధించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వ్యాపార నియమాలను ఉల్లంఘించడమే అని చైనా పేర్కొన్నది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనా సంస్థలను దెబ్బతీస్తుందని చైనా బుధవారం తెలిపింది. తమ దేశానికి చెందిన 59 యాప్‌లపై శాశ్వత నిషేధం విధించడంపై చైనా తొలిసారి నోరు తెరిచింది. 

లడఖ్‌ వద్ద సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో గత సంవత్సరంలో చైనాకు చెందిన పలు యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. తొలుత గత జూన్‌ నెలలో 20 యాప్‌లపై, ఆ తర్వాత సెప్టెంబర్‌ నెలలో మరో 118 మొబైల్‌ యాప్స్‌లను నిషేధించింది. కాగా, వివిధ సంస్థలు ఇచ్చిన వివరణ / స్పందన పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందలేనందున.. టిక్‌టాక్ సహా ఇతర చైనా యాప్‌లపై నిషేధాన్ని కొనసాగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం చైనాకు చెందిన 59 యాప్‌లపై శాశ్వాత నిషేధం ప్రకటించింది. "తమ పక్షపాత చర్యలను భారత్‌ వెంటనే సరిదిద్దాలని, ఇదే సమయంలో ద్వైపాక్షిక సహకారానికి మరింత నష్టం జరుగకుండా ఉండాలని కోరుకుంటున్నాం" అని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాఉండగా, తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ మెమో జారీ చేసింది. నిషేధం కొంత‌కాలం పాటే ఉంటుందని ఇప్పటివరకు తాము అనుకున్నామ‌ని, అయితే, అలా జరుగకుండా శాశ్వత నిషేధ జాబితాలో వెళ్లిందని విచారం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో భారత్‌లో యాప్ ప‌ని చేయ‌నప్పుడు ఇక్కడ ఉద్యోగుల‌ను ఎలా కొన‌సాగిస్తాం? అని ప్రశ్నించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo