బుధవారం 27 మే 2020
International - May 05, 2020 , 17:08:11

లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌ను ప‌రీక్షించిన చైనా

లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌ను ప‌రీక్షించిన చైనా

హైద‌రాబాద్‌: వ్యోమ‌గాముల‌ను నింగిలోకి పంపాల‌నుకుంటున్న చైనా మ‌రో ముంద‌డుగు వేసింది. అత్యంత శ‌క్తివంత‌మైన లాంగ్ మార్చ్‌-5బీ రాకెట్‌ను ఇవాళ డ్రాగ‌న్ దేశం విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది.  వెన్‌చాంగ్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి ఈ భారీ రాకెట్‌ను ప్ర‌యోగించారు. భూక‌క్ష్య‌లోకి ఈ ప్ర‌యోగాన్ని చేప‌ట్టారు. స్పేస్ స్టేష‌న్ నిర్మించాల‌నుకుంటున్న చైనా.. హెవీ రాకెట్ల‌ను ప‌రీక్షిస్తున్న‌ది.  ఎల్ఎం5 సిరీస్‌లో ఇది నాలుగ‌వ వేరియంట్ కావ‌డం విశేషం. మాన‌వ స‌హిత వ్యోమ యాత్ర‌ల‌ను చేప‌ట్టే విధంగా 5బీ రాకెట్ నిర్మాణాన్ని చేప‌ట్టారు.  లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ సుమారు 53.7 మీట‌ర్ల పొడువు ఉన్న‌ది. ఆ రాకెట్‌లో మొత్తం 10 మెయిన్ ఇంజిన్లు ఉన్నాయి. 

ద‌క్షిణ చైనాలోని హైన‌న్ ఐలాండ్‌లోని శాటిలైట్ లాంచ్ సెంట‌ర్ నుంచి రాకెట్‌ను ప్ర‌యోగించారు. ఎల్ఎం5తో పోలిస్తే 5బీ సుమారు మూడు మీట‌ర్లు త‌క్కువ సైజులో ఉన్న‌ది.  20 ట‌న్నుల బ‌రువు కూడా త‌క్కువ‌గా ఉన్న‌ది.  5బీ రాకెట్‌లో కొత్త‌గా రెండు వైఎఫ్ 77 హైడ్రోజ‌న్ ఆక్సిన్ ఇంజిన్ల‌ను అమ‌ర్చారు. మ‌రో నాలుగు బూస్ట‌ర్ల కోసం వైఎఫ్ 100 కిరోసిన్‌, లిక్విడ్ ఆక్సిన్ ఇంజిన్ల‌ను కూడా ఇన్‌స్టాల్ చేశారు. అయితే అనుకున్న‌ట్లు 5బీ రాకెట్‌.. పేలోడ్‌ను క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.


logo