శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 20, 2020 , 03:40:45

చైనాను వణికిస్తున్న కొత్త వైరస్‌

చైనాను వణికిస్తున్న కొత్త వైరస్‌
  • సార్స్‌ లక్షణాలతో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి
  • రెండు రోజుల్లోనే 21 మందికి వ్యాప్తి
  • బాధితుల్లో భారతీయ ఉపాధ్యాయురాలు!
  • ఇప్పటివరకు ఇద్దరు మృతి
  • పలు దేశాలు అప్రమత్తం

బీజింగ్‌, జనవరి 18: చైనాను ఓ కొత్త రకం వైరస్‌ వణికిస్తున్నది. మిగతా దేశాలనూ భయపెడుతున్నది. ఈ వైరస్‌ సోకినవారిలో న్యుమోనియా, సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వ్యాధుల లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని ప్రాథమికంగా ‘నావల్‌ కరోనా వైరస్‌'గా పిలుస్తున్నారు. ఈ వైరస్‌ను ఎలా నియంత్రించాలో అంతుబట్టడం లేదు. ఇది మొదటిసారిగా సెంట్రల్‌ చైనాలోని వూహాన్‌ నగరంలో ప్రబలింది. కాబట్టి ఈ వైరస్‌ను ‘వూహాన్‌ వైరస్‌'గానూ పిలుస్తున్నారు. నగరంలోని చేపల మార్కెట్‌లో ఈ వైరస్‌ ప్రబలిందని అధికారులు తెలిపారు. ఈ నెల 3న మొదటి కేసు నమోదైందని చెప్పారు. మొదట్లో దవాఖానలో చేరిన బాధితులంతా ఆ మార్కెట్‌కు చెందిన వ్యాపారులు, కొనుగోలుదారులేనని పేర్కొన్నారు. ఆ తర్వాత క్రమంగా మిగతావారికీ వైరస్‌ సోకింది. వూహాన్‌లోని మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 500 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నట్టు అంచనా. వైరస్‌ వ్యాప్తితో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

బాధితుల సంఖ్య ఎక్కువే..

ఇప్పటివరకు 62 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారని వుహాన్‌ మున్సిపల్‌ ఆరోగ్యా విభాగం ఆదివారం పేర్కొన్నది. ఆదివారం ఒక్కరోజే 17 మంది బాధితులను గుర్తించామని వెల్లడించింది. ఈ వ్యాధి వల్ల ఇప్పటివరకు ఇద్దరు మరణించారు. బాధితుల్లో 19 మందిని డిశ్చార్చి చేశామని, మిగతావారికి చికిత్స కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వ లెక్కల కన్నా బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండొచ్చని పలు విదేశీ సంస్థలు చెప్తున్నాయి. జనవరి 12 నాటికే వుహాన్‌లో 1,723 కేసులు నమోదైన్నట్లు లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన పరిశోధకులు తెలిపారు. ఇప్పటికి ఈ సంఖ్య రెండువేలు దాటొచ్చని పేర్కొన్నారు.

బాధితుల సంఖ్య

-అధికారిక లెక్కల ప్రకారం 62
-విదేశీ సంస్థల అంచనా.. 2000

భయం గుప్పిట ప్రపంచ దేశాలు

నావల్‌ కరోనా వైరస్‌ను చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇలాంటి వైరసే 2002లో దక్షిణ చైనాలో ప్రబలింది. అది కొన్ని రోజుల్లోనే 25కు పైగా దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మందిని బలితీసుకున్నది. ఇప్పుడు కరోనా వైరస్‌ కూడా విదేశాలకు వేగంగా విస్తరిస్తున్నది. వూహాన్‌ నుంచి రోజూ వేల మంది ప్రజలు ఇతర రాష్ర్టాలకు, విదేశాలకు ప్రయాణిస్తుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో ఇద్దరికి, జపాన్‌లో ఒకరికి ఈ వైరస్‌ సోకింది. ఒక భారతీయ టీచర్‌కు సైతం ఈ వైరస్‌ సోకింది. దీంతో అన్ని దేశాలు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది.ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు

డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికల నేపథ్యంలో అమెరికాతోపాటు ఆసియా దేశాలు అప్రమత్తమయ్యా యి. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించాయి. చైనా నుంచి ముఖ్యంగా వుహాన్‌ నగరం నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు ఈ వైరస్‌ లక్షణాలున్నాయేమో తెలుసుకునేందుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని మూడు విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వంద మంది సిబ్బందిని నియమించామని ఆ దేశ అధికారులు తెలిపారు. చైనాకు వెళ్లే ప్రయాణికుల కోసం భారత ప్రభుత్వం శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. అక్కడికి వెళ్లేవారు, తిరిగి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

‘నూతన’ సమస్య

చైనాలో సంప్రదాయ నూతన సంవత్సర వేడుకలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 8 వరకు ఇవి జరుగుతాయి. ఈ వేడుకల కోసం దాదాపు 104 కోట్ల మంది చైనీయులు ఒక చోటి నుంచి మరోచోటికి ప్రయాణాలు చేస్తారని అంచనా. ఇప్పటికే కోట్ల మంది ఒకవైపు ప్రయాణాలు పూర్తిచేశారు. వేడుకలు పూర్తయిన తర్వాత తిరిగి వస్తారు. ఈ నేపథ్యంలో వైరస్‌ ఇప్పటికే ఎన్ని ప్రాంతాలకు విస్తరించిందోనని.. వేడుకల తర్వాత ఎంతగా ప్రబలుతుందోననే ఆందోళన వ్యక్తమవుతున్నది.

భారతీయ టీచర్‌కు వైరస్‌!

చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న భారతీయురాలు ప్రతీ మహేశ్వరి ఈ వైరస్‌ బారిన పడ్డట్టు అనుమానిస్తున్నారు. ఆమె స్టెప్టోకోకల్‌ ఇన్ఫెక్షన్‌తో (గొంతు సంబంధ వ్యాధి) దవాఖానలో చేరారని అధికారులు తెలిపారు. నావల్‌ కరోనా వైరస్‌ వల్లే ఈ వ్యాధి వచ్చి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఇదే నిజమైతే చైనాలో ఈ వైరస్‌ సోకిన మొదటి విదేశీ వ్యక్తి ఆమేనని పేర్కొన్నారు. ప్రీతికి నగరంలోని దవాఖానలో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారని ఆమె భర్త అషుమన్‌ కోవల్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు.


logo