బుధవారం 08 జూలై 2020
International - May 30, 2020 , 01:15:07

భారత్‌-చైనా.. మధ్యలో ట్రంప్‌

భారత్‌-చైనా.. మధ్యలో ట్రంప్‌

వాషింగ్టన్‌: ఓ వైపు నిత్యం వివాదాలు సృష్టిస్తూనే.. మరోవైపు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ఉరుకులాడే ట్రంప్‌... తాజాగా చైనా, భారత్‌ సరిహద్దు వివాదంలో తలదూర్చారు. తాను ప్రధాని మోదీతో మాట్లాడానని, సరిహద్దు వద్ద చైనా తీరుతో మోదీ విసుగెత్తిపోయారని, అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ‘అమెరికా మీడియాలో కన్నా భారత్‌లోనే నన్ను ఎక్కువ మంది ప్రేమిస్తారు. నాకు మోదీ అంటే చాలా ఇష్టం. ఆయనో గొప్ప వ్యక్తి. చైనాతీరుతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు’ అని పేర్కొన్నారు. చెరో 140 కోట్ల జనాభా.. అపార సైనికశక్తి కలిగిన రెండు శక్తిమంతమైన దేశాల మధ్య వివాదం నెలకొన్నదన్నారు. దీనిని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకొచ్చారు. 

న్యూఢిల్లీ: చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని అమెరికాకు భారత్‌ స్పష్టంచేసింది. ట్రంప్‌ మధ్యవర్తిత్వం తమకు సమ్మతం కాదంది. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్‌కు ఫోన్‌ ద్వారా స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రంప్‌ మధ్యవర్తిత్వ ప్రకటనను భారత్‌ ఇదివరకే తిరస్కరించింది. సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. మరోవైపు, సరిహద్దు సమస్యపై ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడానన్న ట్రంప్‌ ప్రకటనను  విదేశాంగశాఖ శుక్రవారం ఖండించింది. ఇటీవలి కాలంలో మోదీ, ట్రంప్‌ మధ్య ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరుగలేదని తెలిపింది.

బీజింగ్‌: ట్రంప్‌ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను చైనా కూడా తిరస్కరించింది. సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు మూడో దేశం సహకారం అవసరం లేదని స్పష్టంచేసింది. సమస్య పరిష్కారానికి భారత్‌, చైనాకు ప్రత్యేక మార్గాలున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ శుక్రవారం పేర్కొన్నారు. లఢక్‌, సిక్కిం ప్రాంతాల్లో చైనా సైన్యం భారత భూభాగంలోకి చొరబడటంతో ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే. మూడో దేశం జోక్యాన్ని తమ రెండు దేశాలూ కోరుకోవటం లేదని లిజియాన్‌ తెలిపారు. ‘చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకొనే సామర్థ్యం మా రెండు దేశాలకు ఉన్నది’ అని పేర్కొన్నారు.


logo