ఆదివారం 31 మే 2020
International - May 11, 2020 , 12:43:12

అమెరికా '24 ఆరోపణల'ను తిప్పికొట్టిన చైనా

అమెరికా '24 ఆరోపణల'ను తిప్పికొట్టిన చైనా

హైదరాబాద్: కరోనా మహమ్మారికి సంబంధించి అమెరికా నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివని చైనా తీవ్రంగా ఖండించింది. మొత్తం 24 ఆరోపణలను లెక్కగట్టి ఒక్కొక్కదానికి దీటుగా జవాబిచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో చైనా విఫలమైందని, సకాలంలో సమాచారం అందించలేదని, అసలు వైరస్ చైనా ల్యాబ్‌లో‌‌నే తయారైందని, చైనాయే కావాలని వ్యాపింపజేసిందని ఇలా రకరకాల ఆరోపణలు అమెరికా చేస్తున్నది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా ఆరోపణల జోరుపెంచారు. ఆ ఆరోపళన్నిటిపైనా 30 పేజీల సుదీర్ఘ ఖండనను చైనా విదేశాంగశాఖ వెబ్‌సైటులో పోస్టు చేశారు. మీడియా సమావేశాల్లో అమెరికా పెద్దలు చేస్తూవచ్చిన ఆరోపణలకు సవివరంగా అందులో సమాధానమిచ్చారు. ఇదిలాఉండగా విదేశాంగమంత్రి మైక్ పాంపియో తదితరులు ఈ మధ్యన తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారని, వాటిల్లో చైనాపై అనవసరంగా విరుచుకుపడుతున్నారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. 'సత్వరం స్పందించలేదని, సమాచారం సమకూర్చలేదని, చైనాను జవాబుదారీగా నిలిపేందుకు దర్యాప్తులు జరగాలని ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ అంశాలపై చైనా తన వైఖరిని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నదని గుర్తుచేశారు. అమెరికా పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నందున వాస్తవాలను ప్రపంచం ముందు ఉంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం' అని ఆమె తెలిపారు. చైనా సత్వరమే స్పందించలేదన్న ఆరోపణను ప్రస్తావిస్తూ.. చైనా కోవిడ్-19 మహమ్మారికి గురైన మొదటిదేశాల్లో ఒకటని చెప్పారు. ఎప్పుడు ఏం జరిగిందో వివరాలు వెల్లడిస్తే అది వదిలిపెట్టి సంఖ్యల మీద పడ్డారు. ఇతరుల సంఖ్యలు మనకన్నా బాగుంటే వారు అబద్ధాలు చెప్తున్నట్టు కాదు కదా.. ఇదేమన్నా పిల్లలాటనా? అని హువా దుయ్యబట్టారు. నిజానికి అమెరికా సత్వరమే స్పందించలేదని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. విదేశాంగశాఖ వెబ్‌సైటులో పెట్టిన వ్యాసంలో వూహాన్ ల్యాబులో వైరస్ తయారు చేశారనే ఆరోపణను తీవ్రంగా ఖండించారు. అసలు ఆ ల్యాబుకు వైరస్‌ను తయారు చేసే సామర్థ్యం లేదని, పైగా ప్రపంచంలో వ్యాపిస్తున్న వైరస్ మనుషులు తయారు చేసింది కాదని లభిస్తున్న సాక్ష్యాధారాలను ఉదహరించారు. చైనా కంటే ముందే అమెరికాలో కరోనా వ్యాపించిందనే వార్తలను కూడా అందులో పేర్కొన్నారు.


logo