సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 02:14:31

కోల్డ్‌వార్‌ 2.0

కోల్డ్‌వార్‌ 2.0

  • ప్రపంచం ముంగిట మరో ప్రచ్ఛన్నయుద్ధం 
  • తీవ్రమవుతున్న అమెరికా-చైనా ఘర్షణలు 
  • ఆర్థికంగా, రాజకీయంగా ప్రపంచదేశాలపై ప్రభావం 
  • రెండింటిలో ఏ పక్షం వహించాలో తెలియని సంకటస్థితి 

బీజింగ్‌: అమెరికా-రష్యా మధ్య దశాబ్దాలపాటు కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధాన్ని ఆందోళనతో గమనించిన ప్రపంచం.. మరో కోల్డ్‌వార్‌ను చూడనున్నదా? అమెరికా- చైనా మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే ఇది నిజమేనని అనిపిస్తున్నది. జర్మనీకి చెందిన ఓ కీలక అధికారి ‘కోల్డ్‌వార్‌ 2.0’ ప్రారంభమవుతున్నదంటూ ఇటీవల హెచ్చరించారు. కోల్డ్‌వార్‌ 2.0 నేపథ్యంలో పలుదేశాలు సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల వారీగా చూస్తే..

జర్మనీ: యూరప్‌లో పెద్ద ఆర్థికవ్యవస్థ గల జర్మనీకి  అమెరికా, చైనాలతో సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో జర్మనీలో నూతన తరం టెలికం నెట్‌వర్క్‌ల నిర్మాణంలో చైనా కంపెనీ హువావేకి చోటివ్వవద్దని అమెరికా ఒత్తిడి తెస్తున్నా నిర్ణయం తీసుకోలేకపోతున్నది.  హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ అణిచివేతకు చైనా కఠిన వైఖరిని మాత్రం స్పష్టంగానే ఖండిస్తున్నది. అయితే, ఆ దేశ అట్లాంటిక్‌ సహకార విభాగం సమన్వకర్త పీటర్‌ బేయర్‌ మాత్రం అమెరికా, చైనా పరస్పర వైఖరిని విమర్శిస్తూ.. ప్రస్తుతం మనం కోల్డ్‌వార్‌ 2.0 ప్రారంభమైన పరిస్థితులను చూస్తున్నామన్నారు. 

యూరప్‌: జర్మనీ, ఫ్రాన్స్‌ మాదిరే ఇతర యూరోపియన్‌ దేశాలు ఎవరికీ గట్టిగా చెప్పలేకపోతున్నాయి. అందుకే చైనా- హాంకాంగ్‌ సంబంధాలపై ఈయూ ఉమ్మడి విధానాన్ని ప్రకటించలేదు.

భారత్‌: ఆలింగన దౌత్యంతో అటు జిన్‌పింగ్‌తో, ఇటు ట్రంప్‌తోనూ స్నేహపూర్వక సంబంధాలనే ప్రధాని మోదీ ఆశించారు. కానీ, లఢక్‌ వద్ద ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన ఘటనతో ఇరుదేశాల సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. చైనా వస్తువుల  బహిష్కరణకు నినాదాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌తోపాటు పలు చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. 

చైనా-అమెరికా ఘర్షణకు కారణాలివీ..

గత రెండేండ్లుగా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యయుద్ధం నడిచింది. కరోనాకు ముందు నెలకొన్న ప్రపంచ ఆర్థికమాంద్యానికి ఇది కూడా ఓ ముఖ్య కారణం. దక్షిణచైనా సముద్రంపై పూర్తి పట్టు కోసం ఆ ప్రాంతంలోని దేశాలను చైనా బెదిరిస్తుంది. ఆ దేశాలకు అమెరికా అండగా నిలుస్తున్నది.

కరోనా: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా చైనా నుంచే వ్యాపించిన సంగతి తెలిసిందే. చైనా కావాలనే ఆ వైరస్‌ గురించి తొలిరోజుల్లో ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిందని ట్రంప్‌ అనేకసార్లు ఆరోపించారు. ఇంకా చైనాలో ప్రభుత్వ విమర్శకులతోపాటు మైనార్టీ ముస్లింలపై అణిచివేత, హాంకాంగ్‌పై నిర్బంధం, ఇతర దేశాలపై చైనా కంపెనీల నిఘా, హ్యాకింగ్‌ తదితర అమెరికా ఆరోపణలు కూడా ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఒకరి రాయబార కార్యాలయాలను మరొకరు మూసివేసే వరకూ ఈ వ్యవహారం ముదిరింది.

ఫ్రాన్స్‌: అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న ఫ్రాన్స్‌ చైనాతో ఘర్షణలను కొని తెచ్చుకోవాలనుకోవటం లేదు. అందువల్లే, కరోనావ్యాప్తికి కారణం చైనా  అంటూ ట్రంప్‌ చేస్తున్న ఆరోపణలకు మద్దతు పలుకలేదు. అదే సమయంలో అమెరికా ముందు పలచన కాకుండా.. చైనాలో ఉయ్‌గర్‌ ముస్లింలపై అణిచివేత, చైనాలో విమర్శకుల అరెస్టులు తదితర అంశాలను అప్పుడప్పడూ ప్రశ్నిస్తున్నది. 

దక్షిణ కొరియా: చైనా-అమెరికా మధ్య బాగా నలిగిపోతున్న దేశం దక్షిణ కొరియా. అమెరికాతో సైనికంగా, వాణిజ్యపరంగా దగ్గరి సంబం ధాలు ఉన్న దేశం. చైనా, దక్షిణ కొరియా కంపెనీలు పరస్పరం పెట్టుబడులు పెట్టాయి. 

అందుకే చైనా టెలికాం కంపెనీ హూవీ టెక్నాలజీని వాడొద్దని అమెరికా అన్నా, ఈ దేశం వినలేదు. ఉత్తరకొరియా నుంచి రక్షణకు దశాబ్దాలుగా దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా సైన్యాల గడువు గతేడాదితో ముగిసింది. తమ సైన్యాన్ని మోహరిస్తున్నందుకు డబ్బులు చెల్లించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఇక, ఉత్తరకొరియాతో స్నేహపూర్వక సంబంధాలకు దక్షిణ కొరియా చేస్తున్న ప్రయత్నాలు ట్రంప్‌కు రుచించటం లేదు.

చైనా-అమెరికా ఘర్షణలు ఆఫ్రికా దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఆఫ్రికా దేశాల ఆర్థిక ఉత్పాదకతను 2.5 శాతం వరకూ కుంటుపడేలా చేసిందని ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది.


logo