ఆదివారం 05 జూలై 2020
International - Jun 30, 2020 , 17:41:50

59 యాప్‌ల నిషేధంపై చైనా ఆందోళన

59 యాప్‌ల నిషేధంపై చైనా ఆందోళన

బీజింగ్‌: చైనాకు చెందిన, ఆ దేశంతో సంబంధమున్న 59 యాప్‌లను భారత్‌ నిషేధించడంపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ‘చైనా తీవ్రంగా ఆందోళన చెందుతున్నది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ మంగళవారం పేర్కొన్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. ‘అంతర్జాతీయ, స్థానిక చట్టాల నిబంధనలకు కట్టుబడి ఉండాలని చైనా వ్యాపారులకు తమ ప్రభుత్వం చెబుతుంది. చైనాతో సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను సమర్థించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉన్నది’ అని లిజియాన్ చెప్పినట్లు పేర్కొంది. 

దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 యాప్‌లపై భారత్‌ సోమవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌తోసహా హలో, లైకీ, యూసీ బ్రౌజర్‌, కామ్‌స్కానర్‌, విగొ వీడియో, వంటి పలు యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.  తూర్పు లఢక్‌ సరిహద్దులో ఈ నెల 15న భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతోసహా 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు భారత్‌ నిషేధించిన 59 చైనా యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్లు గూగుల్‌ సంస్థ మంగళవారం పేర్కొంది.logo