బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Jan 25, 2020 , 02:59:19

విజృంభిస్తున్న కరోనా!

విజృంభిస్తున్న కరోనా!
  • చైనాలో 26కు చేరిన మృతులు
  • మరో 880 మందికిపైగా బాధితులు
  • వైరస్‌ కట్టడికి చైనా చర్యలు
  • 13 నగరాల్లో ప్రజారవాణా నిలిపివేత
  • 10 రోజుల్లోగా దవాఖాన నిర్మాణం

బీజింగ్‌, జనవరి 24: కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తుండడంతో దాన్ని కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. శుక్రవారం నాటికి 13 నగరాల్లో ప్రజా రవాణాపై నిషేధం విధించింది. బస్సు, రైలు, విమాన సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఆ నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. సుమారు 4.1 కోట్ల మంది ప్రజలపై ప్రభావం పడింది. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటివరకు 26 మంది మృత్యువాతపడ్డారు. మరో 880 మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. చైనాలో శుక్రవారం నుంచి నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కానుండగా, వైరస్‌ వ్యాప్తి కారణంగా వేడుకలు కళ తప్పాయి. కాగా, కరోనా బారిన పడినవారికి చికిత్స అందించేందుకు పదిరోజుల్లోగా దవాఖానను నిర్మించేందుకు చైనా సమాయత్తమైనది. 


వెయ్యి పడకల సామర్థ్యంతో 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ దవాఖాన ఫిబ్రవరి 3 నాటికి అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. ప్రీఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో దీన్ని నిర్మించనున్నారు. 2002-03లో చైనాలో సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) వైరస్‌ ప్రబలినప్పుడు కూడా ఇదే విధానంలో వారం రోజుల్లోనే చైనా దవాఖానను నిర్మించింది. కాగా, వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో షాంఘైలోని డిస్నీల్యాండ్‌ను మూసివేశారు.

 

విదేశాల్లోనూ వేగంగా వ్యాప్తి..

విదేశాల్లోనూ కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. నేపాల్‌లో శుక్రవారం తొలి కేసు నమోదైంది. చైనాలోని వుహాన్‌ నుంచి ఇటీవల తిరిగివచ్చిన నేపాల్‌ విద్యార్థికి వైరస్‌ సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లోనూ వైరస్‌ తాలూకు కొత్త కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 31న చైనాలోని వుహాన్‌లో వైరస్‌ తాలూకు తొలి కేసు నమోదు కాగా, అనంతరం ఇది చైనాను దాటి జపాన్‌, హాంకాంగ్‌, అమెరికా, మకావ్‌, తైవాన్‌, దక్షిణకొరియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, వియత్నాంలకు కూడా వ్యాపించింది.  వైరస్‌ వ్యాప్తిని సమీక్షించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పుడే ‘గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ’గా ప్రకటించలేమని తెలిపింది. అంతమాత్రాన పరిస్థితిని తాము సీరియస్‌గా తీసుకోవట్లేదని భావించకూడదని వ్యాఖ్యానించింది. ‘చైనాలో ఎమర్జెన్సీ ఉన్నది. అయితే ఇది ఇంకా గ్లోబల్‌ ఎమర్జెన్సీగా మారలేదు’ అని డబ్ల్యూహెచ్‌వో అధిపతి టెడ్రోస్‌ అన్నారు. చైనాలో రవాణా వ్యవస్థపై విధించిన ఆంక్షలను తక్కువ కాలానికి పరిమితం చేయాలని సూచించారు.  


రిపబ్లిక్‌ వేడుకలు రద్దు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాలోని భారత రాయబార కార్యాలయం గణతంత్ర వేడుకలను రద్దుచేసింది. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా బహిరంగ కార్యకలాపాలపై చైనా అధికారులు నిషేధం విధించిన నేపథ్యంలో వేడుకలను రద్దు చేసినట్లు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. గురువారం ఎంబసీలో నిర్వహించిన రిపబ్లిక్‌ డే రిసెప్షన్‌కు పలువురు చైనా అధికారులు హాజరయ్యారు.


వ్యాక్సిన్ల తయారీపై కంపెనీల దృష్టి

ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న కొత్త కరోనా వైరస్‌కు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంపై చైనా, అమెరికా కంపెనీలు దృష్టిసారించాయి.  ఈ వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ వేసవిలో నిర్వహించే అవకాశం ఉన్నదని ‘కొయిలేషన్‌ ఫర్‌ ఎపిడెమిక్‌ ప్రిపేడ్‌నెస్‌ ఇన్నోవేషన్‌ (సీఈపీఐ)’ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ హ్యాచెట్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ అభివృద్ధికి మూడు కంపెనీలతో జతకలిసినట్లు చెప్పారు. వ్యాక్సిన్లను వేగంగా అభివృద్ధి చేసి, త్వరితగతిన క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడమే తమ లక్ష్యమని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పేర్కొన్నారు. సార్స్‌పై ఇదివరకే పనిచేసిన మరో కంపెనీ నోవావాక్స్‌ కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. 


logo