మంగళవారం 19 జనవరి 2021
International - Dec 31, 2020 , 12:32:30

సైనోఫార్మ్ కోవిడ్ టీకాకు చైనా గ్రీన్ సిగ్న‌ల్‌

సైనోఫార్మ్ కోవిడ్ టీకాకు చైనా గ్రీన్ సిగ్న‌ల్‌

బీజింగ్‌: సాధార‌ణ వినియోగం కోసం సైనోఫార్మ్ కోవిడ్‌19 టీకాకు డ్రాగ‌న్ దేశం చైనా ఆమోదం తెలిపింది. ష‌రతుల‌తో కూడిన టీకా వినియోగం కోసం ఆ దేశం ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే చైనాలో సుమారు 45 ల‌క్ష‌ల మందికి వైర‌స్ టీకాలు ఇచ్చిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. సైనోఫార్మ్ టీకా 79 శాతం స‌మ‌ర్థ‌వంత‌మైంద‌ని తాజాగా బీజింగ్ సంస్థ పేర్కొన్న‌ది. టీకా వినియోగానికి నేష‌న‌ల్ మెడిక‌ల్ ప్రోడ‌క్ట్స్ అడ్మినిస్ట్రేష‌న్ ఆమోదం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.  సైనోఫార్మ్ త‌యారు చేసిన టీకాకు ఎమిరేట్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.  పాకిస్థాన్ కూడా సుమారు 12 ల‌క్ష‌ల డోసుల కోసం ఆర్డ‌ర్ చేసింది. పాశ్చాత్య దేశాలు కోవిడ్ టీకాకు ఆమోదం తెలుపడంలో ముందు వ‌రుస‌లో ఉండ‌గా.. చైనా మాత్రం చాలా ఆల‌స్యంగా టీకాకు ఆమోదం తెలిపింది. కానీ ఆ దేశం మాత్రం త‌మ దేశీయుల‌కు కొన్ని నెల‌ల నుంచి విభిన్న టీకాలు  ఇస్తూ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న‌ది.  

79 శాతం స‌మ‌ర్ధ‌త‌..

త‌మ టీకా 79 శాతం ప్ర‌భావ‌వంతంగా ఉన్న‌ట్లు సైనోఫార్మ్‌ కంపెనీ చెప్పింది.  సైనోఫార్మ్ సంస్థ చైనాలో మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న‌ది.  అయితే ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్‌, మోడెర్నా టీకాల‌తో పోలిస్తే.. సైనోఫార్మ్ టీకా త‌క్కువ ప్ర‌భావ‌వంతంగా ఉన్న‌ట్లు తేలింది. కానీ ప‌శ్చిమ దేశాల‌తో ధీటుగా చైనా త‌మ సొంతం వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్న‌మై ఉన్న‌ది. ఇప్ప‌టికే అయిదు కంపెనీలు భారీ స్థాయిలో మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నాయి.  వ్యాక్సిన్ క్యాండిడేట్ డేటాను మాత్రం చైనా తొలిసారి బుధ‌వారం రిలీజ్ చేసింది. సుమారు 1.3 బిలియ‌న్ల మందికి చైనాలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొదలుకానున్న‌ది.

కోవిడ్‌19పై సైనోఫార్మ్ టీకా 79.34 శాతం సుర‌క్షితంగా ఉన్న‌ట్లు బీజింగ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ‌యోలాజిక‌ల్ ప్రోడ‌క్ట్స్ పేర్కొన్న‌ది. దేశీయ డ్ర‌గ్ రెగ్యులేట‌ర్‌కు టీకా ఆమోదం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు సైనోఫార్మ్ తెలిపింది. సైనోఫార్మ్ సంస్థ‌కు చెందిన వ్యాక్సిన్‌కు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ఆమోదం తెలిపింది. చాలా చౌకైన ధ‌ర‌కే టీకాను అందుబాటులోకి తేనున్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది.