గురువారం 09 జూలై 2020
International - Jul 01, 2020 , 11:06:49

చైనాలో ఉయ్‌ఘర్‌ ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ

చైనాలో ఉయ్‌ఘర్‌ ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ

బీజింగ్‌:  ఉయ్‌ఘర్‌ ముస్లింల జనాభాను గణనీయంగా తగ్గించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ముస్లిం మైనారిటీల  జనాభాను అదుపు చేసేందుకు బలవంతపు కుటుంబ నియంత్రణ చర్యలను ప్రారంభించింది.   చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉయ్‌ఘర్‌ జనాభా ఎక్కువగా ఉంటుంది.  ఈ మతానికి చెందిన మహిళలే లక్ష్యంగా వారికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని, లేదంటే సంతాన నిరోధక పరికరాలు(ఐయూడీ) వాడాలని చైనా ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది.

వేలాది మంది మహిళలకు గర్భస్త్రావం చేయిస్తున్నారని రిసెర్చ్‌లో తేలింది.  ఈ వ్యవహారంలో   చైనాపై విచారణకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలని  మానవహక్కుల సంఘాలు కోరుతున్నాయి.  షిన్‌జియాంగ్‌లో ముస్లిం జనాభాను కట్టడి చేయడం కోసం చైనా సర్కార్‌ భారీగా   ఖర్చుచేస్తున్నట్లు   తెలుస్తున్నది. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తున్నది. వీటికి సరైన ఆధారాలు లేవని కొట్టిపారేసింది.  ముస్లిం మైనారిటీలను నిర్బంధ శిబిరాల్లో ఉంచి హింసిస్తున్నారని  చైనాపై కొన్నేండ్ల  నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

10 లక్షల మంది ఉయ్‌ఘర్‌ ముస్లింలను, ఇతర ముస్లిం వర్గాల ప్రజలను  పశ్చిమ షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో  నిర్బంధించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఐక్యరాజ్యసమితి గత ఆగస్టులో పేర్కొంది.  ఐతే అవన్నీ రీ-ఎడ్యూకేషన్‌ క్యాంపులని చైనా చెబుతున్నది.    ఉయ్‌ఘర్‌ ముస్లింలపై చైనా అనుసరిస్తున్న వైఖరిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 


logo