శనివారం 31 అక్టోబర్ 2020
International - Sep 20, 2020 , 22:44:56

నేపాల్ భూమిలో చైనా భవనాలు.. నేపాలీలకు ప్రవేశం లేదు

నేపాల్ భూమిలో చైనా భవనాలు.. నేపాలీలకు ప్రవేశం లేదు

ఖట్మండు : నేపాల్ భూమిలో చైనా తొమ్మిది భవనాలను నిర్మించింది. అయితే, నేపాలీ అధికారులను ఈ ప్రాంతంలో అడుగు పెట్టకుండా పరిమితం చేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. చైనా భవనలు నిర్మిస్తున్నది నిజమే అని స్థానికులు చెప్తున్నా.. అవన్నీ వట్టి పుకార్లే అని నేపాల్ విదేశాంగ శాఖ కొట్టిపారేస్తున్నది.

నేపాల్ యొక్క హమ్లా జిల్లా నుంచి ఇటీవలి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చైనీయులు నామ్ఖ్యా గ్రామంలో దొంగతనంగా ఒక భవనాన్ని నిర్మించారు. వాస్తవానికి ఒకే గ్రామంలో మొత్తం తొమ్మిది భవనాల పనులు నిర్మించారు. అక్కడితో ఆగకుండా భవనాల సమీపంలోని నేపాల్ స్థానికుల ప్రవేశాన్ని కూడా పరిమితం చేసింది. గ్రామ మండలి అధిపతి విష్ణు బహదూర్ లామా సాధారణ పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రాంతాలను సందర్శించినప్పుడు ఈ విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) లిమి గ్రామంలోని లాప్చా ప్రాంతంలో తొమ్మిది భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. తనను ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా చైనా సైనికులు నిలిపివేసినట్లు విష్ణు బహదూర్ లామా చెప్పారు. తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి దూరం నుంచి భవనాల చిత్రాలను క్లిక్ చేసిన లామా.. చైనా-నేపాల్ సరిహద్దులో నేపాల్ వైపు రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మాణం జరిగిందని తెలిపారు. భవనాల నిర్మాణం గురించి పీఎల్‌ఏ దళాలను అడగ్గా.. వారి నుంచి ఎలాంటి సమాధానం లేదని లామా పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో చైనా 11 సంవత్సరాల క్రితం ఒక భవనాన్ని నిర్మించినట్లు సమాచారం.

2019 లో చైనా రహదారి అభివృద్ధిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో లిమి, లాప్చా మధ్య చైనా మూడు భవనాల నిర్మాణం నిలిపివేయబడిందని స్థానిక ప్రతినిధులు తెలిపారు. అయితే, చైనా ఇప్పుడు తొమ్మిది భవనాలను నిర్మించిందని, అవి ఇప్పుడు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. అయితే చైనా భవనాల గురించి తెలుసుకునేందుకు అధికారులు నేపాల్ భద్రతా దళాలతో పాటు కొలతలు, సర్వే విభాగం అధికారులను సంబంధిత ప్రాంతానికి పంపించినట్లు తెలిసింది. ఇలా ఉండగా, నేపాల్ భూమిని చైనా ఆక్రమించినట్లు వచ్చిన నివేదికలను ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి ఖండించారు.