శుక్రవారం 10 జూలై 2020
International - Jun 24, 2020 , 10:50:42

నేపాల్‌లో 10 ప్రాంతాల‌ను ఆక్ర‌మించిన చైనా !

నేపాల్‌లో 10 ప్రాంతాల‌ను ఆక్ర‌మించిన చైనా !

హైద‌రాబాద్‌: నేపాల్‌లో సుమారు ప‌ది ప్రాంతాల‌ను చైనా ఆక్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన క‌థ‌నాన్ని ఓ న్యూస్ ఏజెన్సీ రాసింది.  టిబెట్‌లో రోడ్డు నిర్మిస్తున్న చైనా.. నేపాల్ భూభాగాన్ని కూడా వాడుకుంటున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నేపాల్‌కు చెందిన ఓలే ప్ర‌భుత్వం తాజాగా దీనిపై ఓ నివేదిక‌ను రిలీజ్ చేసింది.  నేపాల్ వ్య‌వ‌సాయ‌శాఖ‌కు చెందిన స‌ర్వే డిపార్ట్‌మెంట్ ఈ నివేదిక త‌యారు చేసింది.  నేపాల్‌కు చెందిన సుమారు 33 హెక్టార్ల నేల‌ను చైనా ఆక్ర‌మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స‌హ‌జ స‌రిహ‌ద్దులుగా ఉన్న న‌దుల‌ను మ‌ళ్లించి.. చైనా ఈ ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ట్లు నేపాల్ ప్ర‌భుత్వం త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది. 

టిబెట్ అటాన‌మ‌స్ రీజియ‌న్ ప్రాంతంలో సుమారు ప‌ది చోట్ల చైనా ప్ర‌భుత్వం రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను చేప‌డుతున్న‌ది. దీని వ‌ల్ల న‌దులు, వాటి ఉప‌న‌దులు ప్ర‌వాహాన్ని మార్చుకుని నేపాల్ వైపు వ‌స్తున్నాయ‌ని, ఒక‌వేళ ఇదే ప్ర‌క్రియ కొన‌సాగితే అప్పుడు టీఏఆర్ ప్రాజెక్టు కోసం నేపాల్ చాలా వ‌ర‌కు త‌న భూభాగాన్ని కోల్పోవ‌ల‌సి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వ నివేదిక‌లో తెలిపారు. హుమ్లా జిల్లాలోని బ‌గ్‌ద‌రే ఖోలా న‌ది, క‌ర్నాలి న‌ది ప్ర‌వాహాల‌ను మార్చి .. ఆ ప్రాంతాల్లో దాదాపు ప‌ది హెక్టార్ల నేల‌ను చైనా ఆక్ర‌మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ర‌సువా జిల్లాలో కూడా ఆరు హెక్టార్ల స్థ‌లాన్ని నేపాల్ కోల్పోయింది. 


logo