శనివారం 06 జూన్ 2020
International - Apr 25, 2020 , 12:47:40

కిమ్ దగ్గరకు చైనా ప్రతినిధి బృందాలు ఎందుకు వెళ్లాయి?

కిమ్ దగ్గరకు చైనా ప్రతినిధి బృందాలు ఎందుకు వెళ్లాయి?

హైదరాబాద్: కరోనా కల్లోలం నడుమ ఉత్తరకొరియా అధినేత అంతర్ధానంపై ఊహాగానాల వెల్లువ సాగుతోంది. కిమ్ జోంగ్ ఉన్ ఈ మధ్యకాలంలో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై సహజంగానే అనుమానాలు మొదలయ్యాయి. ఆయనకు తీవ్రంగా జబ్బు చేసిందని, అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని, దాదాపుగా పోయినట్టేనని ఇలా రకరకాలుగా వదంతులు వచ్చాయి. గమ్మత్తుగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించి కిమ్ క్షేమమేనని, ఏమీ ఢోకా లేదని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా జనం మనసుల్లో సందేహాలు అలాగే ఉన్నాయి. ప్రపంచంలో ఉత్తరకొరియాకు ఏకైక సన్నిహిత దేశం చైనా. ఈ నేపథ్యంలో చైనా అధికారులు, వైద్యుల బృందాలు ఉత్తర కొరియాను సందర్శించాయి. ఈ సంగతి రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. అయితే ఎందుకు వెళ్లారో మాత్రం వివరించలేదు. అంతర్జాతీయ సంబంధాల విభాగం సీనియర్ అధికారి ఉత్తరకొరియాకు వెళ్లారు అంటే ఏదో పనిమీదే అయ్యుంటుంది. చైనా అధికారవర్గాలు మాత్రం దీనిపై నోరువిప్పడం లేదు. కిమ్ సజీవంగానే ఉన్నారని, త్వరలో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఓ దక్షిణ కొరియా అదికారి చెప్పారు. కిమ్ ఆరోగ్యస్థితిపై, ఇన్నాళ్లూ బయటకు రాకపోవడంపై ఆయన కూడా ఏమీ చెప్పలేదు. అత్యంత నిగూఢంగా గడిపే దేశాల్లో ఉత్తరకొరియా ఒకటి. ముఖ్యంగా నాయకుల ఆరోగ్యంపై ఎప్పుడూ సమాచారం బయటపెట్టరు. దాంతో ఊహాగానాలకు తెరలేస్తుంది.


logo