శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 09, 2020 , 16:54:51

బైడెన్‌ను అభినందించేందుకు నిరాక‌రించిన చైనా

బైడెన్‌ను అభినందించేందుకు నిరాక‌రించిన చైనా

బీజింగ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన జో బైడెన్‌ను అభినందించడానికి చైనా నిరాకరించింది. జో బైడెన్‌ను అభినందిస్తున్నారా..? అని సోమ‌వారం మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి వాంగ్ వెన్‌బిన్ లేదని స‌మాధానమిచ్చారు. అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నిక‌ల ఫ‌లితం ఇంకా నిర్ణయించబడలేదని అందువ‌ల్ల ఇప్పుడే అభినందన‌లు చెప్ప‌లేమ‌ని ఆయ‌న‌ స్ప‌ష్టం చేశారు. 

ప్రస్తుత ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అంగీకరించలేదు. ఓట్ల లెక్కింపు స‌క్ర‌మంగా జ‌రుగ‌లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. కాగా, గ‌త శ‌నివారం డెమోక్రాట్‌లు విజేతలుగా తేలిపోవ‌డంతో అమెరికాలోని చాలా నగరాల్లో వేడుక‌లు జ‌రిగాయి. ప్రపంచ దేశాల నాయకులు అధ్య‌క్షుడిగా గెలిచిన‌‌ బైడెన్‌ను, ఉపాధ్య‌క్షురాలిగా గెలుపొందిన కమలా హారిస్‌ను అభినందించారు.

కాగా, గ‌తంలో రష్యా, మెక్సికోలతో సహా మ‌రికొన్ని ప్రధాన దేశాల్లో నూత‌న‌ అధ్యక్షులు ఎన్నికైనా తుది నిర్ధార‌ణ అయ్యేవ‌ర‌కు వారిని అభినందించలేదని చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి వాంగ్ పేర్కొన్నారు. అమెరికా ఎన్నిక‌ల్లో బైడెన్ విజేతగా నిలిచిన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చిందని, అయితే తుది నిర్ధార‌ణ జ‌రిగిన త‌ర్వాతే తాము అభినంద‌న‌లు తెలుపుతామ‌ని తెలిపారు. మీడియా ప‌దేప‌దే అడిగిన ప్ర‌శ్న‌కు వాంగ్ స్పందిస్తూ.. అమెరికా కొత్త ప్ర‌భుత్వం చైనాను క‌లుస్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.