మంగళవారం 31 మార్చి 2020
International - Jan 26, 2020 , 02:28:18

కరోనా కోరలు

కరోనా కోరలు
  • చైనాలో 41కి చేరిన మృతులు.. 1300 మంది బాధితులు
  • చైనా నుంచి వచ్చినవారు వైద్యపరీక్షలు చేయించుకోవాలి: కేంద్రం
  • పరిస్థితి తీవ్రంగా ఉన్నది: జిన్‌పింగ్‌

బీజింగ్‌, జనవరి 25: చైనాలో కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ 41 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ వ్యాధి అదుపులోకి వచ్చే పరిస్థితులు ఏమాత్రం కనిపించకపోగా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. వారి సంఖ్య ప్రస్తుతం 1300కు చేరుకుంటున్నది. దీంతో చైనీయులకు వారి సంప్రదాయ నూతన సంవత్సర సంబురాల సంతోషం లేకుండా పోయింది. కరోనా వైరస్‌ చైనాలోనే కాకుండా హాంకాంగ్‌, మకావు, తైవాన్‌, నేపాల్‌, జపాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌, వియత్నాం, అమెరికా వరకు విస్తరించింది. వైరస్‌ బారిన పడిన బాధితుల కోసం ఇప్పటికే ఒక కొత్త దవాఖాన నిర్మాణాన్ని ప్రారంభించిన చైనా, మరో 15 రోజుల్లో రెండో దవాఖాన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. 


కరోనా వైరస్‌ ప్రభావం దేశంలో తీవ్రంగా ఉన్నదని, ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ చెప్పారు. కాగా వ్యాధిగ్రస్తుల్లో 237 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ శనివారం తెలిపింది. రాజధాని బీజింగ్‌ సహా దేశంలోని అన్ని రాష్ర్టాలలో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్నట్టు పేర్కొంది. కరోనా వైరస్‌కు కేంద్రంగా ఉన్న వుహాన్‌ రాష్ట్రం నుంచి ప్రయాణిస్తున్న వారే వ్యాధి బారిన పడుతున్నట్టు తెలిపింది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికి 41 మంది మృత్యువాత పడగా, వీరిలో 39 మంది హుబెయి ప్రావిన్స్‌కు చెందినవారే ఉన్నారు. వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న సిబ్బందిలో మొదటిసారిగా ఓ డాక్టర్‌ శనివారం మృత్యువాత పడ్డారు. మరో 15 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా వ్యాధి బారినపడినట్టు అధికారులు తెలిపారు. వైరస్‌ మరింత విస్తరించకుండా ఉండేందుకు హుబెయి రాష్ట్రంలోని వుహాన్‌ సహా 12 నగరాల్లో అధికారులు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. వైరస్‌ను అదుపుచేసేందుకు ఇంతవరకు ఎటువంటి ఔషధాన్ని నిపుణులు కనుగొనలేదు. 


వుహాన్‌లో 700 మంది భారతీయ విద్యార్థులు

వుహాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం పట్ల భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 700 మంది విద్యార్థులు వుహాన్‌తోపాటు హుబెయి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో చదువుకొంటున్నారు. మరోవైపు భారత్‌లో ఇంతవరకు కరోనా బాధితులెవరినీ గుర్తించనప్పటికీ చైనా నుంచి తాజాగా వచ్చిన ఏడుగురిని కేరళలోని ఓ వైద్య కేంద్రానికి పంపించారు. ఈ సంవత్సరం చైనాకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజల సౌకర్యార్థం 24 గంటలు పనిచేసేలా 91-11-23978046 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు కరోనా వైరస్‌ భారత్‌లో విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయం సమీక్షించింది. ఇంకోవైపు చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తున్నది.


logo
>>>>>>