ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 03:07:41

డ్రాగన్‌.. జులుం

డ్రాగన్‌.. జులుం

  • సరిహద్దు దేశాలకు బెదిరింపులు
  • సైనిక సంపత్తి భారీగా పెంపు: పెంటగాన్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 2: విస్తరణవాదంతో చెలరేగిపోతున్న చైనా తన సరిహద్దు, సమీప దేశాలపై అనేక రూపాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నదని అమెరికా రక్షణశాఖ విభాగం పెంటగాన్‌ తెలిపింది. ప్రపంచంలో అజేయ సైనిక శక్తిగా ఎదిగేందుకు ఆయుధాలను పోగేసుకుంటున్నదని అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న 200 అణు వార్‌హెడ్లను వచ్చే పదేండ్లలో రెట్టింపు చేయాలని కోరుకుంటున్నదని పేర్కొంది. ‘2049నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ తన మిలిటరీ సామర్థ్యాన్ని అమెరికా కంటే శక్తిమంతంగా మార్చుకోవాలని భావిస్తున్నది. కొన్ని విభాగాల్లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఇప్పటికే అమెరికా సైన్యాన్ని అధిగమించింది. 350 నౌకలు, సబ్‌మెరైన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళం చైనాకు ఉన్నది. 1250 గ్రౌండ్‌ లాంచ్‌డ్‌ బాలిస్టిక్‌ (జీఎల్‌బీఎం), క్రూయిజ్‌ క్షిపణులు (జీఎల్‌సీఎం)లు ఉన్నాయి.’ అని మంగళవారం విడుదలైన నివేదికలో వివరించింది. భారత్‌ చుట్టూ ఉన్న పాకిస్థాన్‌, శ్రీలంక, మయన్మార్‌తోపాటు థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఇండోనేషియా, యూఏఈ, కెన్యా, సీషెల్స్‌, టాంజానియా, అంగోలా, తజకిస్థాన్‌లలో సైనిక కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు చైనా ప్రణాళికలు వేసిందని పేర్కొంది. 

అందరితోనూ కయ్యమే

తన సైనిక సంపత్తి, ఆర్థిక శక్తితో పొరుగుదేశాలను చైనా బెదిరిస్తున్నదని పెంటగాన్‌ నివేదిక పేర్కొంది. ‘సాయుధ ఘర్షణకు తావివ్వకుండా జాగ్రత్త పడుతూనే పొరుగు దేశాలపై చైనా పాలకులు తమ లక్ష్యాల సాధనకు బెదిరింపులకు దిగుతున్నారు. డబ్బు ఎరవేసి కొన్ని దేశాలను లొంగదీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది’ అని 200 పేజీల నివేదికలో సమగ్రంగా వివరించింది. 

తూర్పు అత్యంత భద్రం

గల్వాన్‌ ఘర్షణ నేపథ్యంలో భారత్‌ తూర్పు సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించింది. గల్వాన్‌ లాంటి ఘటనలను నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే అరుణాచల్‌లో కీలక ప్రాంతమైన అంజా జిల్లాలో తగు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మరోవైపు తూర్పు లఢక్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, బలగాల ఉపసంహరణ కోసం చుషుల్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు నడుస్తున్నాయి. చర్చల సమయంలోనే చైనా బలగాలు ఆగస్టు 29 రాత్రి భారత్‌లో చొచ్చుకురావడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ ఘర్షణలో భారత సైనికులు ఎవరూ చనిపోలేదని చైనా పేర్కొన్నది. ఘర్షణకు భారత్‌ కారణమని ఆరోపించింది.


చైనా నియంత్రణలో వెయ్యి చదరపు కిలోమీటర్లు!

తూర్పు లఢక్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగం చైనా బలగాల నియంత్రణలో ఉన్నదని సమాచారం. దెప్సాంగ్‌లో 900 చదరపు కిలోమీటర్లు, గల్వాన్‌లో 20 కిలోమీటర్లు, హాట్‌స్ప్రింగ్స్‌లో 12 కిలోమీటర్లు, చుషుల్‌లో 20 కిలోమీటర్లు,  పాంగాంగ్‌లో 65 కిలోమీటర్ల భూభాగం చైనా నియంత్రణలో ఉన్నట్టు సమాచారం.


logo