బుధవారం 27 మే 2020
International - Apr 11, 2020 , 20:52:59

మాంసం కోసం శున‌కాల‌ను పెంచుకోవ‌ద్దు..

మాంసం కోసం శున‌కాల‌ను పెంచుకోవ‌ద్దు..

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో.. చైనా క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ర‌క‌ర‌కాల జంతువుల‌ను తినే దేశ ప్ర‌జ‌ల‌కు చైనా ప్ర‌భుత్వం ఓ ప‌రీక్ష పెట్టింది.  ఇక నుంచి శున‌క మాంసాన్ని విక్ర‌యించ‌రాదు అని ఓ ప్ర‌తిపాద‌న త‌యారు చేసింది.  శున‌కాలు స‌హ‌జీవ‌న జంతువులు అని, అవి ప‌శువులు కాద‌ని చైనా వ్య‌వ‌సాయ మంత్రిత్వ‌శాఖ పేర్కొన్న‌ది. మాంస విక్ర‌యాల‌కు సంబంధించి త‌యారు చేసిన జాబితాలో మొత్తం 31 ర‌కాల జాతి జంతువులను పొందుప‌రిచారు. ఆ జంతువుల మాంసాన్ని అమ్మ‌రాదు అని చైనా ఆదేశాలు జారీ చేసింది. 

వాస్త‌వానికి చైనాలో కొంద‌రు  కుక్క మాంసాన్ని కూడా తింటారు.  కోవిడ్‌19 వైర‌స్ నేప‌థ్యంలో చైనా త‌మ ఆహార అల‌వాట్ల‌లో మార్పులు చేసుకోవాల‌ని ఇప్ప‌టికే అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి.  కుక్క‌ల‌ను మాంసం కోసం పెంచుకోరాదు అని, నాగ‌రిక స‌మాజంలో అవి మ‌నుషుల‌తో పాటు పెరిగాయ‌ని,  అవి ప‌శువులు కాద‌ని, పౌల్ట్రీ కూడా కాద‌ని ఆ దేశ వ్య‌వ‌సాయ‌శాఖ ఇవాళ తీర్మానించింది.  దీనిపై మే 8వ తేదీలోపు ప్ర‌జ‌లు త‌మ స్పంద‌న‌లు తెలుపాల్సి ఉంటుంది.  

వ‌న్య‌ప్రాణి ర‌క్ష‌ణ‌లో భాగంగా చైనా ఈ కొత్త నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ది.  ఒక‌వేళ కుక్క‌ల‌ను లైవ్‌స్టాక్ లేదా పౌల్ట్రీ జాబితాలో పెట్ట‌ని ప‌క్షంలో.. అప్పుడు జంతువుల త‌నిఖీ చేయ‌డం క‌ష్టంగా మారుతుంద‌ని చైనా అభిప్రాయ‌ప‌డింది. డాగ్ మీట్ కోసం బ్రీడింగ్ కానీ, ట్రేడింగ్ కానీ చేస్తే ఇక నుంచి చ‌ట్ట‌రీత్యా నేరంకానున్న‌ది.  ప‌టిష్ట‌మైన త‌నిఖీ వ్య‌వ‌స్థ లేని కార‌ణంగా కుక్క మాంస విక్ర‌యాల‌ను అడ్డుకోవ‌డం అసాధ్యంగా మారిన‌ట్లు వ‌ర‌ల్డ్ యానిమ‌ల్ ప్రొటెక్ష‌న్ పేర్కొన్న‌ది.   

శున‌క మాంసాన్ని సేవించ‌డం అనేది చైనాలో ఎన్నాళ్ల నుంచి వివాదాస్ప‌ద అంశంగా ఉన్న‌ది. కుక్క మాంస వినియోగాన్ని ఆ దేశ జంతు ప్రేమికులు వ్య‌తిరేకిస్తున్నారు.  చైనాలోని గాంగ్జీ జువాంగ్ ప్రాంతంలో ఉన్న యులిన్ కౌంటీలో డాగ్ మీట్ ఫెస్టివ‌ల్ ప్ర‌తి ఏడాది జ‌రుగుతంది. ఆ డాగ్ మీట్ ఫెస్టివ‌ల్‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌తి ఏడాది జంతు ప్రేమికులు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు.  యులిన్ ప్రాంత వాసుల డైనింగ్ హాబిట్స్‌ను అనేక మంది చైనీయులు కూడా వ్య‌తిరేకిస్తున్నారు. డాగ్‌ మీట్ ఫెస్టివ‌ల్స్‌ను ర‌ద్దు చేస్తేనే పెంపుడు జంతువుల ప‌ట్ల ఆప్యాయ‌త పెరుగుతంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వాస్త‌వానికి వుహాన్‌లో ఉన్న వైల్డ్ మార్కెట్ నుంచే క‌రోనా వైర‌స్ వ్యాపించిన‌ట్లు దాదాపు అన్ని ప్ర‌పంచ‌దేశాలు అంగీక‌రిస్తున్నాయి. ఆ మార్కెట్‌లో వివిధ ర‌కాల వ‌న్య ప్రాణుల మాంసాన్ని అమ్ముతుంటారు. స‌ముద్ర జీవులే కాకుండా, గ‌బ్బిలాలు, పాముల‌ను కూడా ఆ మార్కెట్లో విక్ర‌యిస్తుంటారు.  వైర‌స్ వ్యాప్తికి ఈ మార్కెట్ కార‌ణ‌మ‌ని అనేక సిద్ధాంతాలు కూడా ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌చేశాయి.  వుహాన్ మార్కెట్‌ను వెంట‌నే మూసివేయాల‌ని ఇప్ప‌టికే చైనాకు అమెరికా గ‌ట్టివార్నింగ్ కూడా ఇచ్చింది. యూరోప్ దేశాలు కూడా ఆ మార్కెట్‌ను బ్యాన్ చేయాల‌ని కోరుతున్నాయి. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఇదొక మార్గ‌మ‌ని భావిస్తున్నారు. 

logo