శనివారం 23 జనవరి 2021
International - Dec 23, 2020 , 15:30:42

పాక్‌కు చైనా షాక్‌.. అప్పివ్వాలంటే గ్యారెంటీ ఇవ్వాల్సిందే!

పాక్‌కు చైనా షాక్‌.. అప్పివ్వాలంటే గ్యారెంటీ ఇవ్వాల్సిందే!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌కు మ‌రో షాకిచ్చింది చైనా. పాక్‌లోని ఓ కీల‌క ప్రాజెక్ట్‌కు అప్పివ్వాలంటే త‌మ‌కు మ‌రిన్ని గ్యారెంటీలు ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. అస‌లే ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉండ‌టంతో పాక్‌కు కొత్త‌గా అప్పివ్వాలంటే చైనా భ‌య‌ప‌డుతోంది. పాక్‌లోని మెయిన్ లైన్ -1 (ఎంఎల్‌-1) రైల్వే లైన్ ప్రాజెక్ట్ కోసం 600 కోట్ల డాల‌ర్ల అప్పు కోసం చైనా అద‌న‌పు గ్యారెంటీలు డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా పాక్ త‌క్కువ వ‌డ్డీ ఆశ‌ల‌పై కూడా చైనా నీళ్లు చ‌ల్లింది. ఈ కొత్త అప్పును వాణిజ్య‌, రాయితీ లోన్ల మిశ్ర‌మంగా ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. 

కొన్నాళ్లుగా పాక్ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా దిగ‌జారిన విష‌యం తెలిసిందే. అప్పు కోసం ఇంటర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్‌, ప్ర‌పంచ బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతోంది. అప్పు నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని జీ-20 దేశాల‌ను కోరింది. వాస్త‌వానికి పేద దేశాల‌కే ఈ అనుమ‌తి ఇస్తారు. అయితే ఈ అనుమ‌తి ఇవ్వాలంటే పాకిస్థాన్ భారీ మొత్తంలో వాణిజ్య రుణాలు తీసుకునే వీలుండ‌దు. ఇదే నిబంధ‌న‌ను చైనా సాకుగా చూపిస్తోంది. ఇప్ప‌టికే ఈ రుణం కోసం చైనా అధికారుల‌తో పాక్ అధికారులు మూడుసార్లు స‌మావేశ‌మైనా ఫ‌లితం లేక‌పోయింది. ఈ ఎంఎల్‌-1 ప్రాజెక్ట్‌లో భాగంగా పెషావ‌ర్ నుంచి క‌రాచీ వ‌ర‌కు 1872 కిలోమీట‌ర్ల మేర రైల్వే ట్రాక్‌ను అభివృద్ధి చేయ‌డం, రెండో లైను వేయ‌డంలాంటి ప‌నులు ఉన్నాయి. 


logo