బుధవారం 03 జూన్ 2020
International - May 19, 2020 , 01:23:29

కరోనా గుట్టు తేలుద్దాం

కరోనా గుట్టు తేలుద్దాం

  •  వైరస్‌ పుట్టుక, వ్యాప్తిపై విచారణకు డబ్ల్యూహెచ్‌వో అంగీకారం 
  • వైరస్‌ గుట్టు తేల్చాలంటూ డబ్ల్యూహెచ్‌ఏలో ఈయూ డిమాండ్‌ 
  • తీర్మానానికి భారత్‌ సహా వందకుపైగా దేశాల మద్దతు
  • డబ్ల్యూహెచ్‌వోకు 2 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించిన చైనా 

కరోనా.. జీవాయుధమా? ప్రత్యర్థి దేశాల మీద పైచేయి సాధించేందుకు చైనా కావాలనే ప్రపంచంపైకి వదిలిందా? లేక.. అనుకోకుండా ఆ దేశంలో ఓ ప్రయోగశాల నుంచి కరోనా వైరస్‌ లీకైందా? ఇదంతా కాకుండా.. అసలు ఇది సహజసిద్ధంగా పుట్టిన వైరస్సేనా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.. ఇప్పుడు వీటికి జవాబును అన్వేషించే పని ప్రారంభం కాబోతున్నది. కరోనా పుట్టుక, వ్యాప్తి తదితర అంశాలతోపాటు ఈ వ్యవహారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్రపైనా దర్యాప్తు జరుగనున్నది. జెనీవాలో ప్రారంభమైన 73వ వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ దీనికి వేదికగా నిలిచింది. దర్యాప్తు నిర్వహించి తీరాలని భారత్‌తోపాటు వంద దేశాలు పట్టుపట్టడంతో.. సిద్ధమేనని డబ్ల్యూహెచ్‌వో అధిపతి జనరల్‌ టెడ్రోస్‌ ప్రకటించారు.

జెనీవా, మే 18: ప్రపంచం మొత్తాన్ని నెలలపాటు లాక్‌డౌన్‌లోకి నెట్టి.. అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా వైరస్‌ గుట్టు తేల్చే ప్రక్రియ మొదలుకానుంది. ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఈ వైరస్‌ పుట్టుకపై అంతర్జాతీయ దర్యాప్తు జరుపాలన్న వందకుపైగా దేశాల ఒత్తిడి ఫలించింది. కరోనా వ్యాప్తితోపాటు ఈ విశ్వమారిని ఎదుర్కోవడంలో తనపై వచ్చిన విమర్శల మీదా విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. సోమవారం స్విట్జర్లాండ్‌ రాజధాని జెనీవాలో ప్రారంభమైన 73వ ‘వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ’ (డబ్ల్యూహెచ్‌ఏ) సమావేశాల్లో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఈ ప్రకటన చేశారు. ‘కరోనా విపత్తు, దానిపై డబ్ల్యూహెచ్‌ఓ తీసుకున్న నిర్ణయాలు, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం, గడించిన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు తదితర అంశాలపై తగిన తరుణంలో మూల్యాంకనానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. పారదర్శకంగా, స్వతంత్రంగా విచారణ చేస్తామన్నారు. కరోనా పుట్టుక, చైనా తీరుపై తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇది సహజంగా పుట్టిన వైరస్‌ కాదని, జీవాయుధం కోసం చైనా సృష్టించిందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తన ఆధిపత్యం కోసం ప్రత్యర్థి దేశాల మార్కెట్లను దెబ్బతీసేందుకు చైనా దీన్ని వ్యాప్తి చేసిందన్న అనుమానాలూ తలెత్తాయి. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకైందని, స్థానికుల ద్వారా వైరస్‌ వ్యాపించిందన్న వాదనలూ వినిపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏ కంగా కరోనాను చైనా వైరస్‌ అని పేర్కొన్నారు. వైరస్‌ గురించి ముందే తెలిసినా ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని, చైనాకు తొత్తుగా వ్యవహరించిందని మండిపడ్డారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్న సంగతి తెలిసిందే.  

దర్యాప్తునకు సహకరిస్తాం: జిన్‌పింగ్‌ 

డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తునకు తామూ సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. వైరస్‌ పుట్టుక, వ్యాప్తి విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరిస్తున్నదన్నారు. నియంత్రణ, చికిత్స విధానాలను నిరంతరం ఇతర దేశాలతో పంచుకున్నామన్నారు. వైరస్‌ అదుపులోకి రాగానే తాము విచారణకు సహకరిస్తామన్నారు. దీంతోపాటు కరోనాపై పోరుకోసం దాదాపు రూ.15వేల కోట్లు (2 బిలియన్‌ డాలర్లు) ఆర్థిక సాయం ప్రకటించారు. వీటిని రెండేండ్లు ఖర్చు చేస్తామన్నారు. చైనాలో వ్యాక్సిన్‌ తయారైతే ప్రపంచం మొత్తానికి అందిస్తామన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా, సమగ్రంగా సాగాలని ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి మారిస్‌ పయాన్‌ డిమాండ్‌ చేశారు. డబ్ల్యూహెచ్‌ఏ సమావేశాలు 2 రోజులు ఆన్‌లైన్‌లో సాగనున్నాయి. సమావేశాలను ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ ప్రారంభించారు. భారత్‌ సహా వివిధ దేశాల ప్రతినిధులు  పాల్గొన్నారు. 



సకాలంలో స్పందించాం: హర్షవర్ధన్‌

కరోనా కట్టడికి భారత్‌ సకాలంలో అవసరమైన అన్ని చర్యలనూ చేపట్టిందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారని, వైరస్‌ నియంత్రణకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదన్నారు. డబ్ల్యూహెచ్‌ఏను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ.. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడాలంటే.. చికిత్స, వ్యాధి నిర్ధారణ, వ్యాక్సిన్లే మార్గమని చెప్పారు. అంతర్జాతీయ సహకారం అత్యవసరమని, అన్ని వనరులు వినియోగించుకుని, ఫలితాలు అందరికీ అందేలా చూడాలన్నారు. మానవాళి ఏకం కావాల్సిన తరుణమిదన్నారు. తమ వంతుగా 123 దేశాలకు అత్యవసర మందులను సరఫరా చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై ముందుండి పోరాడుతున్న యోధులకు కృతజ్ఞతలు తెలిపారు.  

వైరస్‌ ఎక్కడ, ఎలా పుట్టింది? 

కరోనా పుట్టుక నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాల్లో డబ్ల్యూహెచ్‌వో పాత్రపై దర్యాప్తు చేయాంటూ యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఇటీవల ఓ తీర్మానాన్ని రూపొందించింది. ‘కరోనా ఎక్కడ పుట్టింది? మానవుల్లోకి ఎలా ప్రవేశించింది? ఏ జీవి వాహకంగా పనిచేసింది? కరోనా వ్యాప్తి, వైరస్‌పై ప్రపంచదేశాలను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసిన తీరు, తీసుకున్న చర్యలు, అంతర్జాతీయ ఆరోగ్య చట్టం అమలు తీరు, కరోనాను ఎదుర్కోవడంలో గడించిన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు తదితర అంశాలపై సమగ్రంగా, స్వతంత్రంగా, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు జరుపాలి’ అని ఇందులో డిమాండ్‌ చేసింది. అయితే ఇందులో ఎక్కడా చైనా, వుహాన్‌ పేర్లను ప్రస్తావించలేదు. ఈ తీర్మానాన్ని సోమవారం డబ్ల్యూహెచ్‌ఏలో ప్రవేశపెట్టింది. దీనికి భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, రష్యా, బ్రిటన్‌, కెనడా, 50 సభ్యదేశాలున్న ఆఫ్రికన్‌ గ్రూప్‌ వంటి 100కుపైగా దేశాలు సమ్మతించాయి. మొదటినుంచీ ఈ ప్రతిపాదనను తిరస్కరించిన చైనా.. ఆశ్చర్యకరంగా సోమవారం మాత్రం స్వాగతించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో డబ్ల్యూహెచ్‌వో తలొగ్గింది. 

 కరోనా విపత్తు, దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న నిర్ణయాలు, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం, గడించిన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు తదితర అంశాలపై తగిన తరుణంలో మూల్యాంకనానికి సిద్ధంగా ఉన్నాం.

- టెడ్రోస్‌, డబ్ల్యూహెచ్‌వో

 వైరస్‌ పుట్టుక, వ్యాప్తి విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. నియంత్రణ, చికిత్స విధానాలను నిరంతరం ఇతర దేశాలతో పంచుకున్నాం. వైరస్‌ అదుపులోకి రాగానే విచారణకు సహకరిస్తాం.

- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 


logo