శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 07, 2020 , 20:21:00

ప్రపంచాధిపత్య ఆరోపణలపై చైనా మండిపాటు

ప్రపంచాధిపత్య ఆరోపణలపై చైనా మండిపాటు

హైదరాబాద్: కరోనా విశ్వమహమ్మారి ప్రపంచాధిపత్యం కోసం చైనా పన్నిన కుట్రలో భాగమేనని బ్రెజిల్ విద్యాశాఖామంత్రి అబ్రహాం వెయిన్‌ట్రాబ్ చేసిన ఆరోపణపై బీజింగ్ సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ బ్రెజిల్‌ను చైనా డిమాండ్ చేసింది. మంత్రి వెయిన్‌ట్రాబ్ వ్యాఖ్యలు అర్థరహితమైనవని, గర్హనీయమైనవని బ్రెజిల్‌లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. పైగా ఆ వ్యాఖ్యలు వర్ణవివక్షతో కూడుకుని ఉన్నాయని మండిపడింది. మంత్రి వ్యాఖ్యలపై బ్రెజిల్ అధికారికంగా వివరణ ఇవ్వాలని చైనా ప్రభుత్వం ఆశిస్తున్నదని రాయబారి  యాంగ్ వాన్మింగ్ అన్నారు. చైనీయుల యాసను వెక్కిరిస్తూ ఆయన బ్రెజిల్‌కు బదులుగా బ్లజిల్ అని తన ట్వీట్‌లో పేర్కొనడంపై వివాదం చెలరేగింది. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు మంత్రి నిరాకరించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తమ దేశానికి చైనా వెయ్యి వెంటిలేటర్లు సరఫరా చేస్తే రాయబార కార్యాలయం ముందు మోకరిల్లుతానని అన్నారు. ఇంతకుముందే అధ్యక్షుడు గైర్ బొల్సనారో కుమారుడు, కేంద్ర చట్టసభ సభ్యుడు ఎడ్వర్డో బొల్సనారో కరోనాను చైనీస్ వైరస్ అని ప్రస్తావించడం కూడా రెండు దేశాలమధ్య పొరపొచ్చాలకు దారితీసింది. ఎడ్వర్డో మరీ అంత అజ్ఞానా? అని రియోడిజనీరోలోని చైనా కాన్సల్ జనరల్ లీ యాంగ్ ఓ పత్రికకు పంపిన లేఖలో దుయ్యబట్టారు.


logo