శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 17:01:20

అమెరికా వ్యాక్సిన్ డేటా దొంగతనానికి చైనా, రష్యా కుట్ర

అమెరికా వ్యాక్సిన్ డేటా దొంగతనానికి చైనా, రష్యా కుట్ర

వాషింగ్టన్ : అమెరికా చేపట్టిన కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి యొక్క డేటాను దొంగిలించడానికి రష్యా, చైనా కుట్రపన్నాయి. ఈ విషయాన్ని అమెరికన్ ఇంటెలిజెన్స్ మరోసారి స్పష్టం చేసింది.అమెరికాలో ఫైజర్‌ సహా కొన్ని కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంతో పాటు అనేక హైటెక్ ల్యాబ్‌లలో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, చైనా, రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ పరిశోధన డేటాను దొంగిలించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ విశ్లేషణ తర్వాత బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్ కూడా ఈ దొంగతనానికి పాల్పడిన కుట్రలో భాగస్వామిగా అనుమానిస్తున్నారు.

ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన దేశం తయారు చేస్తున్న టీకాపై ఇతర దేశాలు తెలుసుకోవాలనుకోవడం సహజం. దీని కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఉపయోగిస్తుంటారు. తమ టీకా పరిశోధన, అభివృద్ధి డేటాను దొంగిలించకుండా కాపాడటానికి అమెరికా గట్టి సన్నాహాలు చేసింది. నాటో ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ కూడా దీనికి సహాయం చేస్తున్నట్లు సమాచారం.

రెండు, మూడు దేశాలు దొంగిలించడానికి కుట్ర పన్నిన డేటా.. ఆర్థిక, సైనిక పరంగా చాలా విలువైనదని, ఈ పని ఎవరు చేస్తున్నారో మాకు తెలుసునని యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ టాప్ ఆఫీసర్ జాన్ డిమ్మెర్స్ గత వారమే చెప్పారు. చైనా చర్యల గురించి అమెరికా అధికారులకు మార్చిలోనే సమాచారం అందినట్లు తెలుస్తున్నది. చైనా కుట్రలో డబ్ల్యూహెచ్‌వో ప్రమేయం కూడా ఉన్నట్లుగా వారు అనుమానిస్తున్నారు.

ఇప్పటివరకు జరిగిన ప్రతి చైనా ప్రయత్నాన్ని ఎఫ్‌బీఐ అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ముప్పు గురించి మాకు హెచ్చరికలు పంపుతాయని, ఈ కుట్రలో ఆయా ప్రభుత్వాలు పాల్గొన్నాయని మాకు తెలుసునని యుఎన్‌సి ప్రతినిధి లెస్లీ మింటన్ చెప్పారు. రష్యా కుట్ర గురించి బ్రిటన్ ఎలక్ట్రానిక్ నిఘా సంస్థ జీసీహెచ్‌క్యూ కూడా అమెరికాకు విన్నవించింది. దీని తరువాత హోంల్యాండ్ సెక్యూరిటీ, ఎఫ్బీఐ చురుకుగా మారి వాక్సిన్ తయారుచేస్తున్న ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటుచేశాయి.


logo