గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 19, 2020 , 02:57:03

హిందూ మహాసముద్రంపై డ్రాగన్‌ పట్టు!

 హిందూ మహాసముద్రంపై డ్రాగన్‌ పట్టు!
  • -చైనా, మయన్మార్‌ మధ్య 33 ఒప్పందాలు

నేపైత్వా: హిందూ మహాసముద్రంపై పట్టు సాధిం చే దిశగా చైనా మరో అడుగు ముందుకేసింది. మయన్మార్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ శనివారం ఆ దేశంతో 33 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల్లో చైనా చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌' (బీఆర్‌ఐ) ప్రాజెక్టు పనులతోపాటు ఇతర ప్రాజెక్టుల పనులను కూడా వేగవంతం చేయడం, ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని, పెట్టుబడులను మరింత ప్రోత్సహించడం మొదలైనవి ఉన్నాయి. చైనా, మయన్మార్‌ మధ్య దౌత్యసంబంధాలను ప్రారంభించి 70 ఏండ్లు నిండిన నేపథ్యంలో జిన్‌పింగ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం మయన్మార్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన మయన్మార్‌ నాయకురాలు ఆంగ్‌సాంగ్‌ సూకీతో భేటీ అయ్యారు. మయన్మార్‌-చైనా ఎకనమిక్‌ కారిడార్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నామని, రవాణా, ఇంధనం, సాంస్కృతిక రంగాల్లో ఇరువురం సహకరించుకోవాలని తాము కోరుకుంటున్నామని సూకీ.. జిన్‌పింగ్‌తో చెప్పారు. జిన్‌పింగ్‌ స్పందిస్తూ మయన్మార్‌కు చైనా నమ్మకమైన మిత్రదేశమని తెలిపారు. తమ మిత్రదేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని పేర్కొన్నారు. చర్చల అనంతరం ఇరువురు 33 ఒప్పందాలపై సంతకాలు చేశారు.


logo