బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 09:24:00

పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద కాల్పులు.. భార‌త్‌పై చైనా ఆరోప‌ణ‌

పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద కాల్పులు.. భార‌త్‌పై చైనా ఆరోప‌ణ‌

హైద‌రాబాద్‌: భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్న‌ది. ల‌డాఖ్‌లోని పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద సోమ‌వారం భార‌త సైనికులు కాల్పులు జ‌రిపిన‌ట్లు చైనా ఆరోపించింది. వాస్త‌వాధీన రేఖను దాటి వ‌చ్చిన భార‌త జ‌వాన్లు.. వార్నింగ్ కాల్పులు చేసిన‌ట్లు చైనాకు చెందిన పీఎల్ఏ ద‌ళాలు ఆరోపించాయి.  అయితే ఆ వ్యాఖ్య‌ల‌ను ఇవాళ భార‌త్ కొట్టిపారేసింది. చాలా తీవ్ర స్థాయిలో సైనిక క‌వ్వింపులు జ‌రుగుతున్నాయ‌ని, త‌ప్పుడు ఉద్దేశంతో ఈ చ‌ర్య‌లు చేప‌డుతున్నార‌ని పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ వెస్ట్ర‌న్ థియేట‌ర్ క‌మాండ్ ప్ర‌తినిధి క‌ల్న‌ల్ జాంగ్ సుహిలి తెలిపారు. అధికారిక మిలిట‌రీ వెబ్‌సైట్‌లో చైనా త‌న ప్ర‌క‌ట‌న చేసింది. భారత ద‌ళాలు కాల్పులు జ‌రిపిన వెంట‌నే.. ప‌రిస్థితిని శాంతింప చేసేందుకు త‌మ ద‌ళాలు ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు సుహిలి త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అయితే ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టార‌న్న అంశాన్ని మాత్రం ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించ‌లేదు.  

జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో 20 మంది భార‌తీయ సైనికులు మృతిచెందిన త‌ర్వాత రెండు దేశాల స‌రిహ‌ద్దులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ప‌లుమార్లు సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు జ‌రిగినా.. స‌మ‌స్య కొలిక్కిరావ‌డం లేదు. ప్ర‌మాద‌క‌ర‌మైన చ‌ర్య‌ల‌ను వెంట‌నే ఆపేయాల‌ని  భార‌త్‌ను అభ్య‌ర్థిస్తున్నామ‌ని, అయితే హెచ్చ‌రిక కాల్పులు జ‌రిపిన సంఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టి, బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని సుహిలి త‌న ప్ర‌క‌ట‌న‌లో కోరారు. గ‌త వార‌మే రెండు దేశాల ర‌క్ష‌ణ మంత్రులు మాస్కోలో స‌మావేశ‌మై స‌రిహ‌ద్దు అంశాన్ని చ‌ర్చించారు. కానీ స‌మ‌స్య మాత్రం రోజు రోజుకు ముదురుతూనే ఉన్న‌ది.


logo