గురువారం 26 నవంబర్ 2020
International - Oct 22, 2020 , 14:59:12

నూడిల్స్ తిన్న ఒకే కుటుంబంలో 9 మంది మృతి

నూడిల్స్ తిన్న ఒకే కుటుంబంలో 9 మంది మృతి

బీజింగ్‌ : ఆకలి వేయగానే మనం త్వరగా కడుపు నింపుకోవడానికి నూడుల్స్‌ వైపు చూస్తాం. అవే నూడుల్స్ చైనాలోని ఒక కుటుంబం ప్రాణాలు తీశాయి. ఏడాదిపాటు ఫ్రీజర్‌లో ఉంచిన నూడుల్స్ తినడం వల్లనే ఇలా జరిగివుండొచ్చని వైద్యులు అంటున్నారు. 

చైనా ఈశాన్య ప్రావిన్స్‌ హిలాంగ్జియాంగ్‌లోని జిక్సీ నగరానికి చెందిన ఒక కుటుంబం ఈ నెల 10 వ తేదీన ప్రీజర్‌లో నిల్వచేసిన నూడిల్స్‌ తిన్నారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై కుటుంబంలోని ఏడుగురు ఐదు రోజుల తర్వాత చనిపోయారు. దవాఖానలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు సోమవారం మరణించారు. మరో ముగ్గురు కుటుంబసభ్యులు ఈ నూడిల్స్‌ తినేందుకు ఇష్టపడక పక్కనపెట్టేయడంతో వారు బతికి బయటపడ్డారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తరువాత చైనాలో కలకలం రేపింది. ఇలాంటి పాత నూడుల్స్ తినవద్దని ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేసింది. నూడిల్స్‌లో పులియబెట్టిన మొక్కజొన్న పిండి ఉన్నట్లు తేలింది. ఇది 'బొంగ్రేకిక్' ఆమ్లంతో కలిసి విషంలాగా మారిందని హీలాంగ్‌ జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌లో ఆహార భద్రత డైరెక్టర్ గావో ఫీ చెప్పారు. ఇది కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడుతో పాటు అనేక అవయవాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని గావో ఫీ చెప్పారు. డైలీస్టార్.కో.యూకే నివేదిక ప్రకారం.. బొంగ్రెకిక్ విషం సాధారణంగా కలుషితమైన ఆహారాన్ని తిన్న కొద్ది గంటల్లోనే తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. కడుపు నొప్పి, చెమట, సాధారణ బలహీనత, చివరికు కోమాలోకి వెళ్లిపోతారు. అనంతరం 24 గంటల్లో మరణం సంభవించవచ్చు. ప్రస్తుతాని ఈ విషానికి నిర్దిష్ట విరుగుడు లేదు. ఒకసారి ఈ విషం తీసుకున్నట్లయితే మరణాల రేటు 40 శాతం నుండి 100 శాతం వరకు ఉంటుందని గావో ఫీని ఉటంకిస్తూ డైలీస్టార్.కో.యూకే పేర్కొన్నది.

తినే ముందు గడువు తేదీని చూడండి

నూడిల్స్ తీసుకునే ముందు వాటి గడువు తేదీని తప్పనిసరిగా తనిఖీ చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. సంవత్సరం కంటే ఎక్కువ సమయంపాటు నిల్వ చేసిన నూడిల్స్‌లో విషపదార్థాలు తయారవుతాయని వారు చెప్తున్నారు. విషపూరితమైన నూడిల్స్ వింత రుచిని ఇస్తాయని వారు తెలిపారు. గడువు ముగిసిన నూడిల్స్‌కు బదులుగా తాజా నూడిల్స్‌ తినడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. కలుషిత నూడిల్స్ తినడం వల్ల మన దేశంలో కూడా చనిపోయిన కేసు నమోదైంది. ఐదేండ్ల క్రితం తల్లీకుమార్తె బెంగుళూరులో అనుమానాస్పదంగా మరణించారు. వారు నూడుల్స్ తినడం వల్లనే చనిపోయారని దర్యాప్తులో తేలింది. అదేవిధంగా, హర్యానాలోని శివానగర్‌లో మూడేండ్ల క్రితం ఇలాంటి కేసు వచ్చింది. 50 ఏండ్ల సోమ్‌దత్ నూడిల్స్‌ తిని అనారోగ్యాన్ని గురై చికిత్స పొందుతూ చనిపోయాడు.  చాలా నూడిల్స్ చక్కటి పిండితో తయారవుతాయి. అయితే నూడిల్స్‌ అధిక మొత్తంలో తీసుకోవడం హానికరం. పిండి నూడుల్స్ కూడా ఈ రోజుల్లో మార్కెట్లో వస్తున్నాయి. అటువంటి ఉత్పత్తిని తీసుకునే ముందు, దాని గడువు తేదీని కచ్చితంగా తనిఖీ చేయాలని నిపుణులు సెలవిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.