బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 02:10:08

కెనడావిధానమిదే!

కెనడావిధానమిదే!

  • కరోనా నియంత్రణకు జరిమానాలతో చెక్‌
  • విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా చేయూత
  • ఆన్‌లైన్‌లోనే తరగతులు.. పరీక్షలు కూడా

అట్టావా: ప్రపంచ దేశాల్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారిని నిలువరించడంలో కెనడా పటిష్ఠ చర్యల్ని తీసుకుంటున్నది. వైరస్‌ను నియంత్రించడమే గాక.. మహమ్మారి కారణంగా ప్రభావితమవుతున్న పౌరులు, ఉద్యోగులు, విదేశీ విద్యార్థుల్ని ఆదుకోవడంలో కూడా పలు దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో ఇప్పటివరకూ 25,663 కొవిడ్‌-19 కేసులు నమోదవ్వగా 780 మంది మృత్యువాత పడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వైరస్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నది.

జరిమానాలతో కట్టడి

జనవరి 27న దేశంలో తొలి కరోనా కేసు నమోదైన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలతో పాటు జన సమ్మర్ధం అధికంగా ఉండే షాపింగ్‌ మాల్స్‌, ఆడిటోరియంలు, ఇండోర్‌ స్టేడియంలు, జిమ్‌లు, ప్రార్థనా స్థలాల్ని మూసివేశారు. ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశాలు. అత్యవసర పరిస్థితుల్లో బయటకి వెళ్లాల్సిన వారు నిర్ణీత దూరాన్ని పాటించపోతే వెయ్యి కెనెడియన్‌ డాలర్ల జరిమానా విధిస్తున్నారు. నిత్యావసరాల కొరత రాకుండా వాల్‌మార్ట్‌, డాలర్‌ స్టోర్‌ లాంటి సంస్థలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం.. ఉదయం 7 నుండి 8 గంటల మధ్యలో కొనుగోళ్లు చేసుకొనే వెసులుబాటును కల్పించారు. స్టోర్‌ లోపల, బయట ప్రజలకు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, పరిమిత సంఖ్యలోనే అనుమతించాలని స్టోర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. నిబంధనలు పాటించని స్టోర్లకు లక్ష కెనెడియన్‌ డాలర్ల భారీ జరిమానాను విధిస్తున్నది.

విదేశీయులకు ఆపన్న హస్తం

కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన, లేదా గతంలో కంటే తక్కువ గంటలు పని మాత్రమే దొరుకుతున్న వారిని ఆదుకోవడానికి ‘కెనడా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బెనిఫిట్‌ స్కీమ్‌'ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. నెలకు రెండు వేల కెనడియన్‌ డాలర్ల చొప్పున 16 వారాలపాటు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పౌరసత్వంతో సంబంధం లేకుండా అందర్నీ ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. దీంతో ఇక్కడ విద్యనభ్యసిస్తున్న భారతీయ, విదేశీ విద్యార్థులతోపాటు, ఉద్యోగులకు ఊరట లభించింది.  5,000 కెనెడియన్‌ డాలర్ల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జించిన వ్యక్తులు ఈఐ (ఎంప్లాయ్‌ ఇన్సూరెన్స్‌)కు దరఖాస్తు చేసుకొంటే నెలకు 800 కెనెడియన్‌ డాలర్లను ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన వారు ఇంటి అద్దె, బ్యాంకు రుణాలు పొందిన వాళ్ళు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం తెలిపింది. 

ఆన్‌లైన్‌లో పరీక్షలు

విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకూడదనే  ఉద్దేశంతో విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో తరగతులను నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. 


logo