శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 17:55:22

కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ !

కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ !

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కోవిడ్‌-19 వైరస్‌ను నిర్మూలించడానికి ఆయా దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జనవరి 10న కోవిడ్‌-10 వైరస్‌ జెనెటిక్‌ సీరిస్‌ను చైనా పరిశోధకులు వెల్లడించిన తర్వాత పరిశోధనలు తీవ్రతరం చేశారు. చైనా, అమెరికా, యూరప్‌ దేశాలతో పాటు భారత్‌ కూడా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశాయి.  చైనాలో ఇప్పటికే ఈ విషయంలో క్లినికల్‌ ట్రయల్స్‌ వరకు వెళ్లింది. వ్యాక్సిన్‌ తయారీకి చైనా దేశానికి చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు 24 గంటలు శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్‌ సైన్సెస్‌లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు తెలుస్తోంది. మార్చి 16న మొదటి ట్రయల్‌ జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా వూహాన్‌ నగరానికి చెందిన 108 మందిని మూడు బృందాలుగా విభజించారు. 18-60 ఏండ్ల వయస్సున్న వీరికి భిన్నమైన డోసులు ఇచ్చారు.  వీరిలో కొంతమందికి జ్వరం లక్షణాలు ఉన్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే జంతువులపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించారు. వీరందరినీ 14 రోజులపాటు ఐసోలేట్‌ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రొఫెసర్‌ సారా గిల్‌బర్డ్‌, ప్రొ. ఆండ్య్రూ పోలార్డ్‌, థెరిసా లాంబే, సాండే డగ్లస్‌, ఆండ్రియన్‌ హిల్‌లు నేతృత్వం వహిస్తున్నారు. ఇక్కడ ChAdOx1 వ్యాక్సిన్‌ తయారుచేస్తున్నారు. ఇక్కడ గతంలో MWERS-Cov కరోనా వైరస్‌లకు వ్యాక్సిన్‌ను తయారుచేశారు. అమెరికా కూడా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో పడింది. ఈ దేశానికి చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్నాయి. గతవారంలో యూఎస్‌ఏలో ఎంఆర్‌ఎన్‌ఏ1273 వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ చేశారు. 

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) సమాచారం మేరకు సుమారు 20 రకాల కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల తయారీ పురోగతిలో ఉన్నాయి. గ్లాస్కోస్మిత్‌క్లిన్‌, చైనాలోని బయోఫార్మస్యూటికల్స్‌తో కలసి ప్రయోగాలు నిర్వహిస్తుంది. వీటితోపాటు బయో అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, సాన్‌ఫీ అండ్‌ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో కలసి కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు తీవ్రతరం చేశాయి.

భారతదేశంలో 

మనదేశంలోనూ కోవిడ్‌ను నిర్మూలించాలనే సంకల్పంతో వ్యాక్సిన్‌ తయారీకి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతముందు ఈ రంగంలో అనుభవమున్న ముంబైకి చెందిన సిప్లా కంపెనీ రంగంలోకి దిగింది. త్వరలోనే ట్రయల్స్‌ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో ఎవరో ఒకరు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను తయారుచేసి కరోనా ప్రమాదం నుంచి ప్రపంచాన్ని రక్షిస్తారని కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు.


logo