మంగళవారం 07 జూలై 2020
International - Jun 01, 2020 , 02:14:21

ఆరని ఆగ్రహజ్వాల అమెరికావ్యాప్తంగా కొనసాగిన విధ్వంసకాండ

ఆరని ఆగ్రహజ్వాల అమెరికావ్యాప్తంగా కొనసాగిన విధ్వంసకాండ

  • అధ్యక్ష భవనానికీ తాకిన సెగ 
  • ప్రధాన నగరాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ
  • 1669 మంది అరెస్టు

మిన్నెపొలిస్‌, మే 31: అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఆదివారం దేశంలోని మరిన్ని రాష్ర్టాలు, నగరాలకు హింసాకాండ విస్తరించింది. పోలీసులకు తోడు నేషనల్‌ గార్డ్స్‌ కూడా రంగంలోకి దిగినప్పటికీ ఆందోళనలు ఏమాత్రం తగ్గటంలేదు. వేలమంది నిరసకారులు రోడ్లు, పబ్లిక్‌ పార్కుల్లో గుమికూడి న్యాయం కావాలంటూ నినదిస్తున్నారు. ‘నాకు ఊపిరి ఆడటంలేదు’, మీ చర్యలతో మేం విసిగిపోయాం’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. అల్లర్లను అదుపుచేసేందుకు న్యూయార్క్‌, మిన్నెపొలిస్‌ వంటి డజనుకుపైగా నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. నిరసనలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేలమంది నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించారు.  

వైట్‌హౌస్‌కు తాకిన నిరసనలు

నల్లజాతి యువకుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ గత సోమవారం తెల్లజాతి పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన తర్వాత మొదలైన నిరసనలు ఆదివారం దేశ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు తాకాయి. ఆందోళనకారులు దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ గేటు వద్ద డస్ట్‌బిన్‌కు నిప్పు పెట్టారు. నిరసనలకు కేంద్రమైన మిన్నెపొలిస్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు నగరంలో పదివేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దించారు. ఫిలడేల్ఫియాలో ఆదివారం నాలుగు పోలీస్‌ వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది పోలీసులు గాయపడ్డారు. న్యూయార్క్‌, అట్లాంటా, డెనోవర్‌, లాస్‌ఎంజిల్స్‌, మిన్నెపొలిస్‌, ఆన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్‌ వంటి నగరాల్లో రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ విధించారు. 22 నగరాల్లో గురువారం నుంచి ఇప్పటివరకు 1669 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకవైపు దేశమంతా భగ్గుమంటున్నా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం శనివారం ఫ్లోరిడాలో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ప్రయోగాన్ని తిలకించటంలోనే గడిపారు. హింసాత్మక నిరసనలను డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ ఖండించారు. 

మీ హత్యలతో అలసిపోయాం

నిరసనలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారినప్పటికీ చాలా ప్రాంతాల్లో వేలమంది శాంతియుతంగా ర్యాలీలు తీశారు. వాషింగ్టన్‌ డీసీలో దాదాపు వెయ్యిమంది నల్లజాతీయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల హింసకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. ‘ఈ చర్యలతో (పోలీసుల హత్యలు) మే విసిగిపోయాం. పోలీసుల దాష్టీకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది’ అని నిరసనలో పాల్గొన్న ఓల్గాహాల్‌ అనే మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. ‘జరుగుతున్న పొరపాట్లు నిజానికి పొరపాట్లు కావు. వారు (పోలీసులు) పదేపదే ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. నల్లజాతీయుల హత్యలను ఇప్పటికైనా ఆపాలని అన్నివర్గాల ప్రజలు నినదిస్తున్నారు’ అని బ్రూక్లిన్‌లో నిరసనల్లో పాల్గొన్న మెరిల్‌ మకిల్‌స్కీ అన్నారు. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న అలస్కా రాష్ట్రంలో ఆదివారం నిరసన ప్రదర్శనల్లో పోలీసులు కూడా పాల్గొన్నారు. పోలీసుల అతి హింసను అనుమతించేదిలేదని జునావ్‌ నగర పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఎడ్‌ మెర్సెర్‌ స్పష్టంచేశారు. 

అమెరికన్‌ ఉక్కు మహిళ!

రొమ్మువిరుచుకొని పోలీసుల తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఈ యువతి.. అమెరికాలో నల్లజాతీయుల పోరాటానికి ప్రతిరూపం. మమల్ని కాల్చిచంపడం మీకు అలవాటేకదా.? అన్న సూటి ప్రశ్న, ఈ విద్వేషం ఇంకెన్నాళ్లు అన్న ఆవేదన, ప్రాణాలు అర్పించైనా మా హక్కులు సాధించుకుంటాం.. అన్న ధిక్కార స్వరం ఇలా ఎన్నో భావాలు పలికిస్తున్న ఈ ఫొటోపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఆ యువతిని ఉక్కుమహిళ అంటూ కొనియాడుతున్నారు. 

నిరసనకారులపైకి ట్రక్కు

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఆదివారం నిరసనకారులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లటం కలకలం రేపింది. రోడ్డును దిగ్బంధించి వందలమంది నిరసన తెలుపుతుండగా సమీపంలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న ట్రక్కు ఉన్నట్టుండి వారిపైకి దూసుకెళ్లింది. నిరసనకారులు బాటిల్‌ విసరటంతో డ్రైవర్‌ ఆవేశంతో ఈచర్యకు పాల్పడినట్టు వీడియోలో కనిపించింది. దాడిలో పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డారు. 

ఒబామా తీవ్ర  భావోద్వేగం

జార్జ్‌ ఫ్లాయిడ్‌ దారుణ హత్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ‘ఫ్లాయిడ్‌ హత్య వీడియో చూసి నాకు ఏడుపు ఆగలేదు. సహాయంకోసం అరుస్తున్నా కనికరించక ఊపిరాడకుండా మెడపై మోకాలితో నొక్కిపెట్టడం నల్లజాతీయులపట్ల మన వ్యవస్థ తీరుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.      


logo