ఢిల్లీలో రైతుల నిరసనలపై కెనడా ప్రధాని ఆందోళన

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో పంజాబ్ రైతులు తెలుపుతున్న నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాము భారత ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆయన చెప్పారు. సోమవారం గురునానక్ 551వ జయంతి సందర్భంగా ఆయన కెనడా ఎంపీ బర్దీష్ చగ్గర్ ఏర్పాటు చేసిన ఫేస్బుక్ వీడియో ఇంటరాక్షన్‌లో మాట్లాడారు. ఆయనతోపాటు మంత్రులు నవ్‌దీప్ బైన్స్, హర్జిత్ సజ్జన్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇండియాలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఆ వార్తల గురించి తెలిసి కూడా నేను మాట్లాడకుండా ఉండలేను. అక్కడ తమ కుటుంబం, స్నేహితులు ఎలా ఉన్నారో అన్న ఆందోళన ఇక్కడి వాళ్లలో ఉంది. శాంతియుత నిరసనలకు కెనడా ఎప్పుడూ మద్దతు తెలుపుతుందని నేను మీకు చెప్పదలచుకున్నాను. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ అంశంపై మా ఆందోళన వ్యక్తం చేయడానికి భారత అధికారులతో సంప్రదిస్తున్నాం అని ట్రూడో వెల్లడించారు. ట్రూడో వ్యాఖ్యలపై భారత అధికారులు ఇంకా స్పందించకపోయినా.. కెనడాలోని భారత సంతతి ప్రజల కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనపై స్పందించిన తొలి ప్రపంచ నేత ట్రూడోనే. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న రెండు దేశాల సంబంధాలు ట్రూడో వ్యాఖ్యలతో మరింత దిగజారుతాయని అంచనా వేస్తున్నారు. ఖలిస్థాన్ అనుకూల వర్గాల పట్ల ట్రూడో మెతక వైఖరి అవలంబిస్తున్నారని భారత్ ఆరోపిస్తోంది.