శనివారం 30 మే 2020
International - Apr 06, 2020 , 13:30:19

పార్లమెంటు సమావేశాలూ టెలీకాన్ఫరెన్స్‌లోనే

పార్లమెంటు సమావేశాలూ టెలీకాన్ఫరెన్స్‌లోనే

హైదరాబాద్: కరోనా వచ్చి మనుషులను దూరం చేసింది. సమావేశాల తీరుమారింది. ప్రస్తుతం మటుకు ఏదైనా ఆన్‌లైన్‌లోనే అనే ధోరణి పెరిగింది. కెనడా ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా పార్లమెంటు సమావేశాలూ టెలీకాన్ఫరెన్స్‌లో నిర్వహించాలని చూస్తున్నది. కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పార్లమెంటు అర్జంటుగా చర్చించాల్సి ఉంది. కానీ అంతమంది సభ్యులను సమావేశపర్చడం అంటే రిస్కే. ఎందుకంటే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకే కరోనా వచ్చి తగ్గింది. ట్రూడో సైతం క్వారంటైన్‌లో గడిపారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించాలని పాలక లిబరల్ పార్టీకి చెందిన పాబ్లో రోడ్రిగ్జ్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. స్పీకర్ అంటోనీ రోటాకు, మూడు ప్రధాన ప్రతిపక్షాల నేతలకు ఆయన ఈ విషయమై లేఖలు కూడా రాశారు.

పరిమతి సమంఖ్యలో సభ్యులతో మార్చి 23, 24 తేదీల్లో సమావేశాలు జరిగాయి. అయితే పారిశ్రామికులకు, కార్మికులకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టేందుకు విస్తృతస్థాయిలో పార్లమెంటు ఆమోదం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు కనుక వర్చువల్ సమావేశాలకు గల అవకాశాలను పరిశీలించాలని రోడ్రిగ్జ్ స్పీకర్ను కోరారు. ప్రజలను ఇంటికే పరిమితం చేశాం.. పార్లమెంటు సభ్యులూ అదే పాటించాల్సి ఉందని ఆయన అంటున్నారు. విపక్షాలు సముఖంగానే ఉన్నాయి. ఇంకా స్పీకర్ నిర్ణయం వెలువడలేదు.


logo