శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 09, 2021 , 12:44:13

మిగిలింది 11 రోజులే.. ట్రంప్ అభిశంస‌న సాధ్య‌మేనా ?

మిగిలింది 11 రోజులే.. ట్రంప్ అభిశంస‌న సాధ్య‌మేనా ?

వాషింగ్ట‌న్ : అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే ఆయ‌న మ‌ద్ద‌తుదారులు క్యాపిట‌ల్ హిల్ భ‌వ‌నంపై దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రిప‌బ్లిక‌న్ల‌తో పాటు డెమోక్రాట్లు కూడా ట్రంప్‌ను అభిశంసించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ట్రంప్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్లో కొన‌సాగుతారు. ఆ రోజున జ‌రిగే ప్ర‌మాణ స్వీకారోత్స‌వంతో జో బైడెన్ సంపూర్ణ స్థాయిలో అమెరికా 46వ అధ్య‌క్షుడిగా మారుతారు.  ట్రంప్ రాజీనామా చేయ‌కుంటే మేమే ఆయ‌న్ను అభిశంసిస్తామ‌ని హౌజ్ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ అధికారం నుంచి త‌ప్పుకోవ‌డానికి ట్రంప్‌కు ఇంకా 11 రోజులు మాత్ర‌మే ఉంది. ఆలోగా ఆయ‌న అభిశంస‌న సాధ్య‌మే అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.  

కాంగ్రెస్‌కు హ‌క్కు ఉంది..

నిజానికి ఇది అమెరికా చ‌రిత్ర‌లో ఓ విప‌త్క‌ర ప‌రిస్థితి. రాజ‌కీయంగా, రాజ్యాంగ‌బ‌ద్ధంగా.. ట్రంప్‌ను ఎలా వెళ్ల‌గొట్టాల‌న్న కోణంలో నేత‌లు స‌మాలోచ‌న‌ల్లో ప‌డ్డారు.  ఓ అధ్య‌క్షుడిని ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు అభిశించ‌లేదు. ఆ అభిశంస‌న ప్ర‌క్రియ‌లో దోషులుగా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌ర్నీ తేల్చ‌లేదు. మ‌రోసారి ట్రంప్ అధికార బాధ్య‌త‌లు చేప‌ట్ట‌కుండా ఉండేందుకు కావాల్సిన అన్ని మార్గాల‌ను రాజ‌కీయ పండితులు వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది.  తీవ్ర స్థాయిలో నేరాలు, దేశ‌ద్రోహం, అక్ర‌మాల‌కు పాల్ప‌డితే, అప్పుడు అధ్య‌క్షుడిని తొల‌గించే హ‌క్కు యూఎస్ కాంగ్రెస్‌కు ఉన్న‌ది.  అధ్య‌క్షుడిని అభిశంసించాలంటే ముందుగా హౌజ్‌లో ఓటింగ్ జ‌ర‌గాలి.  ఒక‌వేళ అనుకూలంగా ఓట్లు పోలైతే, అప్పుడు సేనేట్ ఆమోదం ప్ర‌కారం విచార‌ణ జ‌రుగుతుంది. సుప్రీం కోర్టు సీజే స‌మ‌క్షంలో కేసు విచార‌ణ ఉంటుంది.    

రెండవ‌సారి ఎవ‌ర్నీ అభిశంసించ‌లేదు..

ప‌ది రోజుల్లో అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోనున్న ట్రంన్‌ను అభిశంసించ‌డం నిజానికి వ్య‌ర్థ ప్ర‌క్రియే. కానీ అలా చేస్తే ఆయ‌న‌పై మ‌చ్చ మాత్రం మిగులుతుంది. ఒక‌వేళ దోషిగా తేలితే, ఆయ‌న మ‌ళ్లీ అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌కుండా సేనేట్ ఓటింగ్ చేసే అవ‌కాశం ఉంటుంది.  ట్రంప్‌పై అన‌ర్హ‌త వేటు విధించాలంటే.. సేనేట‌ర్ల‌లో స్వ‌ల్ప మెజారిటీ స‌రిపోతుంది. 2024 అధ్య‌క్ష పోటీపై కూడా ట్రంప్ క‌న్నేసిన నేప‌థ్యంలో ఈ ప్ర‌క్రియ కీల‌కం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.  2019 డిసెంబ‌ర్ లో ట్రంప్‌పై మొద‌టిసారి అభిశంస‌న జ‌రిగింది. అధికార దుర్వినియోగం కేసులో హౌజ్ ఆయ‌న్ను త‌ప్పుప‌ట్టే ప్ర‌య‌త్నం చేసింది. కానీ ఆ అభిశంస‌న విఫ‌ల‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు అమెరికా అధ్య‌క్షుల్ని అభిశంసించారు. కానీ రెండవ‌సారి ఎవ‌ర్నీ అభిశంసించ‌లేదు.  స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా.. హౌజ్‌లో ఓటింగ్‌.. ఆ త‌ర్వాత విచార‌ణ‌కు త‌క్ష‌ణ‌మే సేనేట్‌ ఆమోదం చేయ‌డం అత్య‌వ‌స‌రం అవుతుంది.  అయితే జ‌న‌వ‌రి 20లోగా విచార‌ణ అసాధ్య‌మ‌ని సేనేట‌ర్ మిచ్ మెక్‌కాన‌ల్ తెలిపారు.  వంద మంది సేనేట‌ర్లు ఒక‌వేళ అభిశంస‌న ప్ర‌క్రియ వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తేనే ట్రంప్ తొల‌గింపు జ‌రుగుతుంది. కానీ ప్రమాణ స్వీకారం వేళ సేనేట‌ర్లు ఒక్క‌టి కావ‌డం అసాధ్య‌మే.   

ప్ర‌క్రియ మొద‌లైతే ఆగ‌దు..

మాజీ అధ్య‌క్షుడిగా కూడా ట్రంప్‌ను అభిశంసించే అవ‌కాశం ఉన్న‌ది.  వైట్‌హౌజ్‌ను వ‌దిలి వెళ్లిన త‌ర్వాత ట్రంప్‌ను విచారించేందుకు కావాల్సిన అన్ని మార్గాల‌ను హౌజ్ లాయ‌ర్లు అన్వేషిస్తున్నారు.  1876లో అధ్య‌క్షుడు ఉలిసిస్ ఎస్ గ్రాంట్ సెక్ర‌ట‌రీని రిజైన్ చేసి వెళ్లిన త‌ర్వాత కూడా అభిశంసించారు. ట్రంప్‌ను అభిశంసించ‌కుండా ఉండేందుకు కార‌ణాలు ఏవీలేవ‌ని కొంద‌రు అమెరికా రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఒక‌సారి అభిశంస‌న ప్ర‌క్రియ మొద‌లైతే, ఆ త‌ర్వాత ఆ వ్య‌క్తి ఆఫీసు వీడినా.. ఆ ప్ర‌క్రియ కొన‌సాగాల్సిందే అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.   


logo