బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 10, 2020 , 17:05:23

నగరాలను దహించివేస్తున్న కాలిఫోర్నియా కార్చిచ్చు

నగరాలను దహించివేస్తున్న కాలిఫోర్నియా కార్చిచ్చు

వాషింగ్టన్: ఉత్తర కాలిఫోర్నియాలో రాజుకున్న కార్చిచ్చు పలు నగరాలను దహించి వేసింది. మూడు వారాలుగా పలు ప్రాంతాలకు వ్యాపిస్తున్న అటవీ మంటల్లో వేలాది ఇండ్లు, నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. గాలులు తోడుకావడంతో బుధవారం ఒక్కరోజులోనే సుమారు 40 కిలోమీటర్ల మేర అగ్నికీలలు వ్యాపించాయి. నగరాలపై దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటల్లో లెక్కలేనన్ని ఇండ్లు, వాహనాలు ఆహుతయ్యాయి. పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. దక్షిణ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్, శాన్ బెర్నార్డినో, శాన్ డియాగో కౌంటీలలో అటవీ, కొండ ప్రాంతాలు కాలిపోయాయి. లాస్ ఏంజిల్స్‌కు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాల ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కార్చిచ్చు వల్ల తాజాగా బుధవారం ముగ్గురు మరణించారు. అధికార గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది. కార్చిచ్చు మరింతగా వ్యాపిస్తుండటంతో ప్రజలు తమ ఇండ్లను వీటి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.

మరోవైపు మంటలను అదుపు చేసేందుకు ఫైర్, అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అవి అదుపులోకి రాకపోవడంతో ప్రజలను రక్షించడంలో వారు నిమగ్నమయ్యారు. కాగా గత వారం దక్షిణ కాలిఫోర్నియాలో 8 జాతీయ అటవీ ప్రాంతాలను  మూసివేసినట్లు ప్రకటించిన అమెరికా అటవీశాఖ తాజాగా ఈ సంఖ్యను 18కి పెంచింది. ఈ ప్రాంతాల పరిధిలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు విద్యుత్  వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో కార్చిచ్చు గురించి సమాచారం అందక కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడ్డారు. చాలా మంది ప్రజలు తమ ఇండ్లను వీటి పోతుండటంతో నగరాల్లోని రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించింది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo