గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 21, 2020 , 02:04:06

నిర్బంధంలో కాలిఫోర్నియా

నిర్బంధంలో కాలిఫోర్నియా

- ప్రపంచం గజగజ

- 11 వేలు దాటిన మృతులు

హాంకాంగ్‌/పారిస్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ఈ వైరస్‌తో 163దేశాల్లో శుక్రవారం నాటికి 11,015 మంది మరణించారు. ప్రభావిత కేసుల సంఖ్య 2,56,296కు చేరింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కదలికలపై నిర్బంధం విధించింది. దీంతో అమెరికాలో నిర్బంధంలో ఉన్న రాష్ర్టాల్లో నాలుగో రాష్ట్రంగా ఉంది. కాలిఫోర్నియాలోని నాలుగు కోట్ల మంది నిర్బంధంలో చిక్కుకున్నారు. ఇక చైనా తర్వాత వైరస్‌ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇటలీలో గురువారం కూడా 427 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం 475 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా ప్రభావంతో ఇటలీలో మరణించిన వారి సంఖ్య 3,405 మందికి చేరింది. మరణాల్లో వైరస్‌కు కేంద్రమైన చైనాను దాటేసింది. ఇక చైనాలో ఇప్పటి వరకు 3,248 మంది మరణించారు. చైనాలో వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసులు నమోదుకాకపోవడం విశేషం. మరోవైపు వైరస్‌ను కట్టడి చేయడానికి పలు దేశాలు గట్టి చర్యలు చేపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్వారెంటైన్‌ కేంద్రాలు పెరిగిపోతున్నాయి. కోట్ల మంది స్వీయ నిర్బంధాన్ని విధించుకుంటున్నారు. 

సగం మరణాలు ఐరోపాలోనే..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల మరణించిన వారిలో దాదాపు సగం మంది ఐరోపా ఖండం వాసులే. ఆసియా ఖండంలో పుట్టిన వైరస్‌ ఐరోపా ఖం డాన్ని ఏవిధంగా వణికిస్తున్నదో అర్థమవుతున్నది. నిర్బంధ ఆంక్షలను ఉల్లంఘించిన 4000 మందికి పైగా ఫ్రాన్స్‌ తొలిసారి జరిమానాలను విధించింది. ఆంక్షలను పట్టించుకోని మంత్రులపై ‘ఇడియట్స్‌' అనే స్టాంపింగ్‌ వేస్తున్నది. ఇటలీ, స్పెయిన్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్‌ సోకిన వారిలో స్పెయిన్‌లోనే నాలుగోవంతు ఉన్నారు. జర్మనీలో అతిపెద్ద రాష్ట్రమైన బవరియా రెండు వారాల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఇరాన్‌లో కరోనా మరణాలు 1,433కి చేరాయి. ఆఫ్రికా దేశాల్లో మాత్రం 700పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


logo