ఆదివారం 09 ఆగస్టు 2020
International - Jul 07, 2020 , 21:11:39

అమెరికాలో అవిభక్త కవలలు కన్నుమూత

అమెరికాలో అవిభక్త కవలలు కన్నుమూత

వాషింగ్టన్ : అవిభక్త కవలలు అయిన రోనీ, డోన్నీ గెలాయన్ కన్నుమూశారు. వీరి వయసు 68 సంవత్సరాలు. డేటన్లో దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు జిమ్ మీడియాకు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత పెద్ద వయసు అవిభక్త కవలలుగా వీరు రికార్డులకెక్కారు. ఈ అవిభక్త కవలలు 1951 అక్టోబర్ 28 న అమెరికా ఒహియో రాష్ట్రంలోని బెవర్‌క్రీక్‌లో జన్మించారు.

ఇద్దరు వ్యక్తుల శరీరాలు అతుక్కుని పుట్టడం చాలా అరుదుగా ఉంటుంది. ఇలాంటి వారు తక్కువ కాలం జీవించేఅవకాశాలు ఉంటాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. రోనీ, డోన్నీలు ఉదర భాగంలో శరీరాలు అతుక్కొని పుట్టి నిస్సహాయంగా ఉన్నప్పటికీ చాలా కష్టపడ్డారు. మూడేండ్ల వయస్సు నుంచి సర్కస్, కార్నివాల్ లో పనిచేయడం ప్రారంభించారు. 1991 వరకు ఈ పనిని కొనసాగించారు. తరువాత ఉద్యోగాన్ని వదిలి 2010 వరకు ఒంటరిగా ఉన్నారు. సర్కస్ లో సంపాదించిన డబ్బుతో వారు జీవించారు. అనంతరం కాలంలో వీరి ఆరోగ్యం క్షీణించడంతో.. సోదరుడు జిమ్ వద్ద ఉన్నారు.

2014 లో రికార్డును నెలకొల్పారు

రోనీ, డోన్నీ.. 63 సంవత్సరాల వయస్సులో శరీరాలు అతుక్కొని పుట్టి జీవితపు సుదీర్ఘ ప్రయాణం రికార్డును నమోదు చేశారు. అంతకుముందు ఈ రికార్డు అమెరికాకు చెందిన చెంగ్, ఆంగ్ బంకర్ పేరున ఉన్నది. వారు 62 సంవత్సరాలు జీవించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి అవిభక్త కవలలు వాణి, వీణలు ఉన్నారు. వీరు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిని విడదీసేందుకు చాలా ఏండ్లపాటు ప్రయత్నాలు చేసి.. తుదకు ప్రభుత్వ ఆశ్రమంలో పెరుగుతున్నారు.


logo