గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 17:29:02

మంచుఫలకాలపై కూర్చొని ‘వాతావరణ మార్పుల’పై యువతి నిరసన..

మంచుఫలకాలపై కూర్చొని ‘వాతావరణ మార్పుల’పై యువతి నిరసన..

లండన్‌: ‘వాతావరణ మార్పు’ అనేది చాలాకాలంగా ప్రపంచాన్ని పట్టిస్తున్న సమస్య. ఇది చాపకిందనీరులా భవిష్యత్తులో మొత్తం అన్ని దేశాలనూ ప్రభావితం చేయగలదు. ప్రతిఏటా ఉష్ణోగ్రతల్లో మార్పులతో ప్రపంచంలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఐస్‌క్యాప్స్‌ వేగంగా కరుగుతున్నాయి. ఇదే కొనసాగితే, భవిష్యత్తులో కొన్ని దేశాలకుదేశాలే కనిపించకుండా పోతాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పులపై అన్ని దేశాల అధినేతలు స్పందించాలని కొంతకాలంగా గ్రెటా థన్‌బెర్గ్ అనే అమ్మాయి పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈమె బాటలోనే మరో అమ్మాయి పయనిస్తోంది. వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నాయకులు స్పందించాలంటూ మంచుఫలకాలపై కూర్చొని నిరసన తెలిపింది. 

మైరోజ్ క్రెయిగ్ బంగ్లాదేశ్ మూలాలున్న బ్రిటీష్ అమ్మాయి. ఆమె వయస్సు 18 ఏళ్లు. గ్లోబల్‌వార్మింగ్‌తో మంచుఫలకాలు కరిగిపోతున్నాయని తెలుసుకొని చలించిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఐస్ షీట్‌పై కూర్చొని నిరసనకు దిగింది. ‘యూత్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్’ అనే ఫ్లకార్డు చేబూని పర్యావరణ పరిరక్షణకు పాటుపడండి అంటూ పిలుపునిస్తోంది.‘వాతావరణ మార్పులపై నా తరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.’ అని క్రెయిగ్‌ పేర్కొంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నాయకులు ఓ మంచి నిర్ణయం తీసుకునేదాకా పోరాటం ఆపబోనని స్పష్టంచేసింది.  

క్రెయిగ్ పక్షి ప్రేమికురాలు. 'బర్డ్‌గర్ల్' పేరుతో ఒక బ్లాగును కూడా నడుపుతున్నది. అక్కడ ఆమె తన పక్షులు చేసే సాహసాలను పోస్ట్ చేస్తుంది. బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లో గౌరవ డాక్టరేట్ పొందిన ఇంగ్లాండ్‌లోని అతి పిన్న వయస్కురాలు కూడా. థన్‌బెర్గ్‌ ప్రారంభించిన ప్రపంచవ్యాప్త నిరసనలు కరోనాతో ఆగిపోయాయి. అయితే ఊహించనివిధంగా క్రెయిగ్‌ నిరసనకు దిగింది. ఆమె చేసిన ట్వీట్‌కు నెటిజన్లు భారీగా స్పందించారు. ‘మంచి పనిచేస్తున్నారు.. కొనసాగించండి..’ అటూ కామెంట్‌ పెట్టారు.  



logo