గురువారం 28 మే 2020
International - Apr 05, 2020 , 18:27:20

కరోనాను ముందుగానే పసిగట్టే సరికొత్త పరీక్ష

కరోనాను ముందుగానే పసిగట్టే సరికొత్త పరీక్ష

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచానికి ఓ అగ్నిపరీక్షలా తయారైంది. ముందుగా గుర్తించగలిగితే సమస్య చాలావరకు పరిష్కారం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ శాస్త్రవేత్తలు ముందస్తు సంకేత పరీక్ష రూపొందించారు. దీనిని నియాప్టరీన్ పరీక్ష అని పిలుస్తున్నారు. ఇది చాలా సింపుల్ పరీక్ష. ఈ పరీక్ష జరిపే కిట్‌ను ఇంటికే పోస్టు ద్వారా పంపవచ్చు. లాక్‌డౌన్‌లో ఉన్నవారు ఇంటివద్దే దీనిని ఉపయోగించి తమకు కరోనా సోకిందీ, లేనిదీ తెలుసుకోవచ్చు. సెకండ్లలో ఫలితాలు వస్తాయి. ఒకరకంగా ఇది ప్రెగ్నెన్సీ టెస్టులాగే ఉంటుంది. రక్తం, ఉమ్మి, మూత్రం ఈ మూడుంటిలో దేనితోనైనా పరీక్ష చేసుకోవచ్చు. నిజానికి వైరస్ ఉందా లేదా అనేదానికన్నా ఇమ్మ్యూనిటీ, అంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరును ఇది పట్టిస్తుంది. ఒకవేళ ఇమ్మ్యూనిటీ స్పందన మొదలైతే ఆ సంగతి ఇది తెలియజేస్తుంది.

ఈ ఫలితాన్ని బట్టి కరోనాను అంచనా వేయవచ్చు. న్యూక్యాజిల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరీక్షను రూపొందించారు. ఇతర పరీక్షలతో కలిపి దీనిని ఉపయోగించవచ్చని ఆ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాలిన్ సెల్ఫ్ అన్నారు. పరీక్షలు ఎక్కువగా జరపాల్సిన అవసరం గురించి బ్రిటన్‌లో వాదోపవాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ పరీక్ష ముందుకు వచ్చింది. అయితే ఈ కిట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఇంకా తెలియరాలేదు. 


logo