మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 22:52:12

అపార్ట్‌మెంటే లేదు.. కానీ అందులోని ఫ్లాట్‌ అమ్మాడు..!

అపార్ట్‌మెంటే లేదు.. కానీ అందులోని ఫ్లాట్‌ అమ్మాడు..!

దుబాయ్‌: అసలు అక్కడ అపార్ట్‌మేంటే లేదు. కానీ అందులోని ఫ్లాట్‌ను ఓ బ్రిటీష్‌ వ్యక్తి ఈజిప్ట్‌ వ్యక్తికి అమ్మాడు. 7.7 మిలియన్ డాలర్లు వసూలు చేసి, కనిపించకుండా పోయాడు. మోసపోయానని తెలుసుకున్న ఈజిప్ట్‌ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ నయా మోసానికి దుబాయ్‌ వేదికగా మారింది.  

39 ఏళ్ల ఓ వ్యక్తి దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్‌ స్టాంపులను ఉపయోగించి నకిలీ పత్రాలు సృష్టించాడు.  ది అడ్రస్ రెసిడెన్స్ ఫౌంటెన్ వ్యూస్ లోని అపార్ట్‌మెంట్‌ను అమ్ముతున్నట్లు నాటకమాడాడు. డెవలపర్ ఎమార్ ప్రాపర్టీస్‌ పేరుతో ఉన్న నకిలీ భవన ప్రణాళికలను చూపించాడు. రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీకి తాను అధిపతినని చెప్పాడు. దీంతో ఈజిప్టు వ్యక్తి  7.7 మిలియన్ డాలర్లు అతడికి చెల్లించాడు. కాగా, 2018 లో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మాత్రమే టైటిల్ డీడ్ జారీ చేయబడుతుందని నమ్మబలికాడు. కాగా, బ్రిటీష్‌ వ్యక్తి ఇచ్చిన గడువు అయిపోగా, ఈజిప్ట్‌ వ్యక్తి ఎమార్‌ ప్రాపర్టీస్‌ను సంప్రదించాడు. వారు ఇచ్చిన సమాధానంతో కంగుతిన్నాడు. అసలు తను కొనుగోలు చేసిన ఫ్లాట్‌ ఉనికిలోలేదని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. అది అమ్మిన వ్యక్తి ఇతరులను కూడా మోసం చేసి పారిపోయాడని తెలుసుకుని దుబాయ్‌ కోర్టు మెట్లెక్కాడు. దీనిపై కోర్టు తాజాగా వాదనలు విన్నది. అక్టోబర్ 26 న తీర్పు వెలువడనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo