బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 21:37:11

మునిగిపోతున్న మహిళను రక్షించిన బ్రిటన్‌ దౌత్యవేత్త

మునిగిపోతున్న మహిళను రక్షించిన బ్రిటన్‌ దౌత్యవేత్త

బీజింగ్: నదిలోకి కాలుజారి పడిపోయిన ఓ విద్యార్థిని బ్రిటన్‌ దౌత్యవేత్త రక్షించారు. అందరూ చూస్తుండగానే నదిలోకి దూకి విద్యార్థిని కాపాడిన ఆయన.. అక్కడి ప్రజల్లో హీరోగా నిలిచారు. అమ్మాయిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో తక్కువ వ్యవధిలో వైరల్‌గా మారింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే పది లక్షలకు పైగా వ్యూస్‌ లభించాయి. వారంతంలో పర్యాటక పట్టణం ఊంగ్షాన్‌ మీదుగా కుటుంబంతో కలిసి నడుస్తూ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో.. అక్కడ నదిలో కాలుజారి ఓ యువతి పడిపోయింది. అక్కడే ఉన్న ప్రజలు ఆమెను రక్షించమంటూ ఆరిచారు. 61 ఏండ్ల వయసున్న బ్రిటన్‌ కాన్సుల్ జనరల్ స్టీఫెన్ ఎల్లిసన్ మరో ఆలోచన చేయకుండా యువతిని కాపాడేందుకు రంగంలోకి దిగాడు. కొందరు యువకులు ట్యూబులను అందించి వారు నది ఒడ్డుకు చేరుకునేలా సహకరించారు. చాంగ్కింగ్‌లోని బ్రిటన్ మిషన్ సోమవారం ఈ విషయాన్ని తెలిపింది. "సకాలంలో నదిలోకి దూకి రక్షించడంతో సదరు మహిళ త్వరగా శ్వాస అందుకు స్పృహ కోల్పోకుండా ఉండగలిగింది" అని కాన్సులేట్ అధికారిక వీబో పేజీలో పోస్ట్ చేశారు. "చాంగ్కింగ్‌లోని బ్రిటన్‌ కాన్సుల్ జనరల్ చేసిన పనికి మేమెంతో గర్వపడుతున్నాం" అని చైనాలోని యూకే దౌత్య మిషన్ సోమవారం ట్వీట్ చేసింది.

ఎల్లిసన్ ధైర్యం వార్తలు వ్యాపించడంతో "చాంగ్కింగ్‌లోని బ్రిటిష్ కాన్సుల్ జనరల్ నీటిలో పడిపోయిన మహిళా విద్యార్థిని రక్షించారు" అనే హ్యాష్‌ట్యాగ్ సోమవారం సాయంత్రం నాటికి వీబోపై దాదాపు 40 మిలియన్ల గుర్తింపులను పొందింది. "వృద్ధాప్యంలోనూ మరొక వ్యక్తిని నీటి నుంచి రక్షించడానికి తన ప్రాణాలను ఫణంగా పెట్టడం ఆయన హీరోయిజానికి నిదర్శనం " అని నెటిజెన్లు పలువురు అభినందిస్తూ వ్యాఖ్యలు జోడిస్తున్నారు. 2014 నుంచి బీజింగ్‌లోని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో సీనియర్ దౌత్యవేత్తగా పనిచేసిన తరువాత ఎల్లిసన్ జూన్‌లో ఈ పదవిని చేపట్టారు. చైనా టెలికాం దిగ్గజం హువావేని తన 5 జీ నెట్‌వర్క్‌ల నుంచి నిషేధించాలన్న యూకే నిర్ణయంతోపాటు హాంకాంగ్, జిన్‌జియాంగ్‌తో సహా చైనా మానవ హక్కుల రికార్డుపై యూకే తరచుగా విమర్శలు చేయడంతో ఈ ఏడాది యూకే-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.