సోమవారం 01 జూన్ 2020
International - Apr 11, 2020 , 20:26:35

సామాజిక దూరం పాటించడం నిరవధికమేనా?

సామాజిక దూరం పాటించడం నిరవధికమేనా?

హైదరాబాద్: కరోనా కల్లోలం నుంచి ఎలా బయటపడాలని ఆలోచించని దేశం ఈ భూమ్మీద లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం నడిపిన బ్రిటన్ ఇప్పుడు కరోనా గుప్పిట్లో కలత నిదుర పోతున్నది. ఏకంగా ఆ దేశ ప్రధాని కరోనా బాధితుడయ్యారు. ఈ నేపథ్యంలో లండన్ పెద్దలు ఏమి ఆలోచిస్తున్నారు అనేది తప్పకుండా ప్రాముఖ్యం సంతరించుకునే అంశం. బ్రిటన్ వచ్చేనెల లాక్‌డౌన్ నుంచి బయటకు వస్తుందని భావిస్తున్నారు. అయితే జీవితం ఇదివరకటిలాగా ఉంటుందని కాదు. కరోనా అనంతర కాలంలో బ్రిటన్ ప్రణాళిక బహుశ ఇలా ఉండబోతున్నది. జూన్‌లో ముందుగా మొదలయ్యేవి స్కూళ్లు. తర్వాత అన్ని రకాల దుకాణాలు తెరుస్తారు. భారీస్థాయి సామాజిక సమావేశాలకు చిట్టచివరి ప్రాధాన్యత ఉంటుంది. పెద్దలు ఇంటిపట్టున ఉండడం అనేది సుదీర్ఘకాలం కొనసాగవచ్చు. వైరస్ తో నెలలు లేదా సంవత్సరాలు సహజీవనం చేయాల్సి రావచ్చు. కనుక ఆఫీసులకు పోవడం, బంధువులను సందర్శించడం అనేది అత్యవసరమైతేనే చేయాలి. ఈ విషయమై ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మలివిడత కరోనా విజృంభణను అడ్డుకునేందుకు ఐచ్ఛికంగా సామాజిక దూరాన్ని నిరవధికంగా కొనసాగించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.


logo