శుక్రవారం 15 జనవరి 2021
International - Dec 27, 2020 , 00:57:44

జేమ్స్‌ ‘డబుల్‌ బాండ్‌'

జేమ్స్‌ ‘డబుల్‌ బాండ్‌'

  • బ్రిటన్‌, రష్యా గూఢచారి జార్జ్‌ బ్లేక్‌ కన్నుమూత

మాస్కో: పుట్టింది నెదర్లాండ్స్‌. పెరిగింది ఇంగ్లండ్‌. పని గూఢచర్యం. ఎవరికీ తెలియకుండా దేశాలు దాటడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. విదేశాలకు వెళ్లి అక్కడి యుద్ధ తంత్రాలు తెలుసుకొని చెప్పడం అతని విధి.  అంతా చదువుతుంటే జేమ్స్‌ బాండ్‌ సినిమాలా ఉన్న ఈ కథ బ్రిటన్‌ ఇంటలిజెన్స్‌ అధికారి జార్జ్‌ బ్లేక్‌ది. జార్జ్‌ బ్లేక్‌ వయస్సు 98 ఏండ్లు. ఆయన చనిపోయినట్టు రష్యా విదేశీ నిఘా విభాగం శనివారం వెల్లడించింది. బ్రిటన్‌ ఇంటలిజెన్స్‌ అధికారిగా పనిచేసిన బ్లేక్‌ను అదే దేశం 1966లో అరెస్టు చేసింది. బ్రిటన్‌తో పాటు ఏకకాలంలో రష్యాకు కూడా గూఢచారిగా పనిచేస్తుండటమే అందుకు కారణం. 1950లో కొరియా యుద్ధం సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. ఉత్తరకొరియాపై అమెరికా బాంబుల వర్షాన్ని సహించలేని బ్లేక్‌ అమెరికాపై కోపంతో రష్యాకు నిఘా సమాచారం అందించారు. డబుల్‌ ఏజెంట్‌గా పనిచేశారు. బ్రిటన్‌కు చెందిన ఎన్నో విషయాలను రష్యాకు తెలిపారు. దీంతో బ్రిటన్‌ ఆయనకు 42 ఏండ్ల జైలు శిక్ష విధించగా.. అధికారుల కన్నుగప్పి రష్యాకు పారిపోయారు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు. రష్యాలో ఆయనకు రష్యన్‌ ఇంటలిజెన్స్‌ కర్నల్‌ ర్యాంకు ఉన్నది. బ్లేక్‌ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌ సంతాపం ప్రకటించారు.