సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 08:44:31

మరోమారు స్వీయ నిర్బంధంలో బ్రిటన్‌ ప్రధాని

మరోమారు స్వీయ నిర్బంధంలో బ్రిటన్‌ ప్రధాని

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా భయం పట్టుకున్నది. ఇప్పటికే ఒకసారి కరోనా బారినపడిన ఆయన, మళ్లీ మహమ్మారి సోకుతుందనే భయంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా బారిన పడిన ఓ వ్యక్తిని కలిసిన నేపథ్యంలో తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన రోగి ప్రధానిని కలిసిన దృష్ట్యా బోరిస్‌కు స్వీయ నిర్బంధం అవసరమని యూకే నేషనల్ హెల్త్ సర్వీసు టెస్ట్‌ అండ్ ట్రేస్ ద్వారా తెలిపింది. దీంతో తనకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ స్వీయనిర్బంధంలోకి వెళ్తున్నాని, నిబంధనల ప్రకారం 10 రోజులపాటు ఇంటి నుంచే పరిపాలనను కొనసాగిస్తానని చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

కరోనా రోగిని కలిసిన ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి చెప్పారు. గత గురువారం డౌనింగ్‌ స్ట్రీట్‌లో కొందరు ఎంపీల బృందాన్ని కలిశారు. వారితో ఆయన 35 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఆ బృందంలో ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రధాని బోరిస్‌ తనకు కూడా కరోనా సోకుందనే భయంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనకు ఏప్రిల్‌లో కరోనా సోకింది. దీంతో దవాఖానాలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స చేయించుకున్న తర్వాత కోలుకున్నారు.