మంగళవారం 04 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 14:18:59

అమెజాన్‌లో 28 శాతం పెరిగిన అగ్ని ప్ర‌మాదాలు

అమెజాన్‌లో 28 శాతం పెరిగిన అగ్ని ప్ర‌మాదాలు

బ్ర‌సేలియా : అమెజాన్ అడ‌వుల్లో అగ్నిప్ర‌మాదాలు పెర‌గ‌డంపై నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. బ్రెజిల్ అమెజాన్ అడ‌వుల్లో అగ్నిప్ర‌మాదాలు ఏడాది క్రితంతో పొల్చితే జులైలో 28 శాతం పెరిగాయని ఓ సంస్థ తెలిపింది. గత నెలలో అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో 6,803 మంటలు చెల‌రేగిన‌ట్లు పేర్కొంది. కాగా అదే నెల 2019లో 5,318 అగ్నిప్ర‌మాదాలు మాత్ర‌మే నమోదయ్యాయని బ్రెజిల్‌ను పర్యవేక్షించే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ తెలిపింది. అగ్నిప్ర‌మాదాల సంఖ్య పెర‌గ‌టంపై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. సాధార‌ణంగా ఈ ప్రాంతంలో ఆగ‌స్టులో మంట‌లు ఎక్కువ‌గా సంభ‌విస్తుంటాయి. ఈ సీజ‌న్‌లో మొత్తం 30,900 అగ్నిప్ర‌మాదాలు చెల‌రేగిన‌ట్లుగా స‌మాచారం. 

ఆర్థికాభివృద్ధి నిమిత్తం బ్రెజిల్ అమెజాన్‌లో భూమిని చ‌దును చేయాల్సిందిగా అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పేర్కొన్నారు. ఈ పిలుపుపై దేశీయ, అంతర్జాతీయస్థాయిలో ఆందోళనలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలోనే మంట‌లు బాగా పెరిగాయి. దీంతో పాంటనాల్ చిత్తడి నేలలు, అమెజాన్ అడవిలో కాల్చడాన్ని ప్రభుత్వం నాలుగు నెలల పాటు నిషేధించింది. అమెజాన్‌లో పర్యావరణ చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మిల‌ట‌రీకి ఉత్త‌ర్వులు జారీచేశారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వ స్పందన స‌రిగా లేద‌న్నారు. గ‌త సంవత్సరం కంటే ఈ ఏడాది అడ‌వుల్లో అగ్నిప్ర‌మాదాలు ఎక్కువ‌గా సంభ‌వించే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొన్నారు.


logo