గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 10, 2020 , 20:41:17

కొడుకు త‌ప్పు చేశాడని‌.. త‌న బెడ్‌రూమ్‌నే రోడ్డుకీడ్చిన త‌ల్లిదండ్రులు!

కొడుకు త‌ప్పు చేశాడని‌.. త‌న బెడ్‌రూమ్‌నే రోడ్డుకీడ్చిన త‌ల్లిదండ్రులు!

చిన్న‌పిల్ల‌లు ఒక స్టేజ్ వ‌ర‌కే మాట వింటారు. త‌ర్వాత అన్నీ మాకు తెలుసులే అనే పొగ‌రుతో రెచ్చిపోతుంటారు. దీంతో ఎన్ని ప్ర‌మాదాల‌కైనా పాల్ప‌డుతారు. అయితే ఓ బాలుడు తెలిసీ తెలియ‌క చేసిన త‌ప్పుకి రోడ్డు మీద శిక్ష అనుభ‌విస్తున్నాడు. ఇది విధించింది ఎవ‌రో కాదు, క‌న్న త‌ల్లిదండ్రులే. మ‌రి ఆ బాలుడు ఏం త‌ప్పు చేశాడో తెలుసా? యాంజెల్ మార్టినెజ్ అనే 14 ఏళ్ల బాలుడు త‌ల్లిదండ్రులు లేని స‌మ‌యంలో వారి ప‌ర్మిష‌న్ లేకుండా రేంజ్ రోవ‌ర్ కారుతో విన్యాసాలు చేస్తూ ఇరుగుపొరుగు వారికి ఆటంకం క‌లిగించాడు. దీంతో పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకొని త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి చెప్పారు.

హుటాహుటిన వ‌చ్చిన త‌ల్లిదండ్రులు బాలుడిని విడిపించి ఇంటికి తీసుకెళ్లారు. త‌ర్వాత అత‌ని బెడ్‌రూంలో ఉన్న వ‌స్తువుల‌న్నింటినీ రోడ్డు మీద‌కి షిఫ్ట్ చేశారు. డ‌బుల్‌కాట్ మంచం, టేబుల్‌, టీవీతో స‌హా అన్నింటి రోడ్డు ప‌క్క‌న పెట్టి అక్క‌డ ఒక బోర్డ్ కూడా పెట్టారు. ఇంటికి రాకుండా నువ్వు ఇక్క‌డే ఉండాల‌ని వార్నింగ్ కూడా ఇచ్చారు త‌ల్లిదండ్రులు. ఆ బోర్డులో ‘‘క్షమించండి, నేను నా తల్లిదండ్రుల కారును దొంగిలించి. వేగంగా నడిపాను’’ అని రాసి ఉంది. 'దీనికి ఆ బాలుడు నేను కావాల‌ని న‌డ‌ప‌లేదు. కారును శుభ్రంగా క‌డిగాను. అందులో వాట‌ర్ ఉండ‌డంతో అవి బ‌య‌ట‌కు పోయేలా అక్క‌డే రౌండ్లు వేశాను. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఉంటే మామూలుగా బ‌య‌ట‌కు వెళ్లేవాడిని' అని చెప్పుకొచ్చాడు. 'ఇత‌ని ర్యాష్ డ్రైవింగ్ వ‌ల్ల ఇత‌రులు కొన్ని వ‌స్తువుల‌ను పోగొట్టుకున్నారు. ఇప్పుడు వాటి విలువ తెలిసేలా చేయ‌డానికి ఇలా చేశామ‌ని' చెప్పుకొచ్చాడు తండ్రి.  


logo