శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 28, 2020 , 10:53:15

స‌రిహ‌ద్దు స‌మ‌స్యపై జోక్యం కుద‌ర‌దు: చైనా

స‌రిహ‌ద్దు స‌మ‌స్యపై జోక్యం కుద‌ర‌దు:  చైనా

హైద‌రాబాద్‌: సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు భార‌త్ చేప‌ట్టే చ‌ర్య‌ల‌కు అమెరికా అండ‌గా నిలుస్తుంద‌ని అగ్ర‌దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.  ఇండియా టూర్‌లో ఉన్న ఆయ‌న మంగ‌ళ‌వారం ఈ వ్యాఖ్య‌లు చేశారు.  అయితే ఆ కామెంట్ల‌పై ఇవాళ డ్రాగ‌న్ దేశం చైనా స్పందించింది.  స‌రిహ‌ద్దు వివాదం ద్వైపాక్షిక అంశ‌మ‌ని, ఈ విష‌యంలో వాస్త‌వాల‌ను, నిజాల‌ను అమెరికా గ్ర‌హించాల‌ని చైనా పేర్కొన్న‌ది. చైనా ఎంబ‌సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలు, న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కులపై మూడ‌వ పార్టీ జోక్యం అవ‌స‌రం లేద‌ని చైనా వెల్ల‌డించింది.   భార‌త్‌, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు స‌మ‌స్య ద్వైపాక్షిక అంశ‌మ‌ని, రెండు దేశాలు ఈ అంశంపై చ‌ర్చిస్తున్నాయ‌ని, సైనిక‌ప‌రంగా, దౌత్య‌ప‌రంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, విభేదాల‌ను ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం రెండు దేశాల‌కు ఉన్న‌ట్లు చైనా త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఈ అంశంలో జోక్యం చేసుకునే అవ‌కాశం మూడ‌వ పార్టీకి లేద‌ని చైనా చెప్పింది. చైనాతో ప్ర‌మాదం ఉంద‌న్న వాద‌న‌ల‌ను ఆపేసి.. మెద‌డు నుంచి ప్ర‌చ్చ‌న్న‌యుద్ధ ఆలోచ‌న‌ల్ని తీసివేయాల‌ని కోరింది.  వాస్త‌వాల‌ను గౌర‌వించి, స్థానిక సామ‌ర‌స్య‌త‌కు స‌హ‌క‌రించాల‌ని అమెరికాను చైనా కోరింది.